Tuesday, November 26, 2024

సీఎం జగన్ తన తర్వాత స్థానాన్ని నాకు ఇచ్చారు: ధర్మాన

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తర్వాత స్థానాన్ని తనకు ఇచ్చి ఎంతో గౌరవం కల్పించారని తాజా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గ్రామ వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మాన మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే వారికి ఉన్నతమైన గుర్తింపు లభిస్తుంది అనడానికి తానే ఉదాహరణ అని చెప్పారు. గత మూడేళ్లలో తొలుత ఆర్ అండ్ బీ శాఖకు, ఆ తరువాత రెవెన్యూ శాఖకు మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందన్నారు.

30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ప్రతిష్టాత్మక రీ సర్వే కార్యక్రమాలు తన చేతుల మీదుగా ప్రారంభం కావడాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పారు. పాత, కొత్త కలయికతో నూతన మంత్రివర్గం ఏర్పాటు కానుందని వెల్లడించారు. ముందుగా చెప్పినట్లు మేమంతా ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానంగా ఇప్పుడు పనిచేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాల పార్టీ బాధ్యులుగా, రీజనల్ కోఆర్డినేటర్స్‌గా తమకు అప్పగించే బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తాం అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకుంటానని ధర్మాన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనకు ఏ పని అప్పగించినా.. త్రికరణశుద్ధిగా దాన్ని ఆచరించే వ్యక్తిగా ముందుంటానని చెప్పారు. పదవుల కోసమో.. మంత్రి స్థానం కోసం ఆలోచించే వ్యక్తిని తాను కాదని తేల్చి చెప్పారు. ఒక సిన్సియర్ కార్యకర్తగా పని చేస్తునే ఉంటానని చెప్పారు. తన నియోజకవర్గంలోని నాయకులు అందరూ ముఖ్యమంత్రి మాటకు గౌరవించి ముందుకు సాగుతామన్నారు. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చూడటమే తమ అందరీ లక్ష్యమని ధర్మాన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement