హైదరాబాద్ – హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం చాలా పవిత్రమైంది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో నెలంతా భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. తెల్లవారుజామునే కార్తీక స్నానమాచరించి.. కార్తీక దీపం వెలిగిస్తారు. కాగా నవంబర్ 2వ తేదీన ప్రారంభమైన కార్తీక మాసం నేటి సోమవారంతో ముగుస్తుంది. చివరి సోమవారం కావడంతో ఎపి, తెలంగాణాలలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు గోదావరి, కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వదిలారు. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలతో పాటు ప్రముఖ ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శివాలయం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక స్నానాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు స్వామివారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేశారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తున్నారు. ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, భీమారామం, అమరారామం వంటి పంచారామ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. త్రిపురాంతకం, భైరవకోన, శ్రీకాళహస్తి, కపిలతీర్థం తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
పశ్చిమగోదావరి..
పంచారామ క్షేత్రం పాలకొల్లలోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి స్వామి వారి మూలవిరాట్‌కు అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు దీపోత్సవాలు చేస్తున్నారు. కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నారు.
విశాఖపట్నం..
కార్తీక మాసం చివరి నాల్గవ సోమవారం సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. వేకువజామునుంచే శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. సింహాచలం కొండపై స్వయంభుగా వెలసిన త్రిపురాంతక స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. మహిళలు ఆలయాల ముందు కార్తీక దీపాలు వెలిగించి.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
నంద్యాలలో..
కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భక్తజనం పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. గంగాధర మండపం వద్ద, మాడవీధులలో పలుచోట్ల కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కలు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అధికారులు అనుమతి ఇస్తున్నారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది.
ద్రాక్షారామం….
కార్తీక మాసం నల్గవ సోమవారం కావడంతో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచి సప్తగోదావరిలో నదిలో పుణ్య స్నాన మాచరించి భక్తులు శ్రీ అమ్మ వారిని శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
పిఠాపురం పాదగయా క్షేత్రం
కార్తీక మాసంతో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయా క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసం నల్గొవ సోమవారం తెల్లవారుజాము నుంచే పాదగయ పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి, పురుహూతిక అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలంగాణాలో..
తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులతో కృష్ణా, గోదావరి తీరాల్లో సందడి నెలకొంది. ప్రముఖ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో రద్దీ నెలకొంది. రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక దీపాలు వెలిగించి ఆ ముక్కంటి కృపాకటాక్షాలు తమపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారికి గోపూజ, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు నిర్వహించారు. కార్తిక మాసం చివరి సోమవారం కావండతో రెండుసార్లు సత్యనారాయణ వ్రతం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత, అన్నపూజ సేవలను రద్దు చేశారు. తెల్లవారుజామునుండే క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో ఆది దంపతుల దర్శనానికి ఐదు గంటల సమయం పడుతున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. వాడపల్లిలోని మీనాక్షి అగస్తేశ్వర ఆలయంతో పాటు పిల్లలమర్రి, మేళ్లచెరువు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాచలంలోని గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపాలను నదిలో వదులుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బీఆర్పురం శివాలయం, నాచారంలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయాల్లో అభిషేకాలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి.. ఆ గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉసిరిచెట్టు వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షణలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి తదితర ఆలయాల్లో కార్తీక సోమవారం రద్దీ కొనసాగుతోంది. భక్తులు నదిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.