( ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్డీఆర్ జిల్లా బ్యూరో )ఇటు గురు పౌర్ణమి ఉత్సవం, మరో వైపు శాకంభరీ మహోత్సవం ముగింపు, అంతక ముందు గిరిప్రదక్షణ సందర్భంగా ఆదివారం విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై భక్త జనం పరవళ్లు తొక్కారు. భారీ వర్షం కురుస్తున్నా.. భక్తులు ఎక్కడా తగ్గలేదు. కొండ చెరియలు విరిగిపడతాయనే ఆందోళనతో ఘాట్రోడ్డునుఅధికారులు మూసివేశారు. అయినా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు.
శాకంభరీ ఉత్సవాలో ఆఖరి రోజు ఆదివారం ఉదయం ఆలయ వైదిక సిబ్బంది సప్త శతి హవణం, మహావిద్యా పారాయణం, శాంతి పౌష్టిక హోమం, మంటప పూజలు నిర్వహించారు. అనంతరంఉదయం 9.30 గంటలకు పూర్ణాహుతి, కూష్మాండ బలి, మార్జనం, కలశోద్వాసన, ఆశీర్వాదం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు దంపతులు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అంతక ముందు ఉదయం 5.00 గంటలు ఇక లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కోసం, ధర్మప్రచారం నిమిత్తం వేదపండితుల మంత్రోచ్చరణలు, దుర్గమాత నామ స్మరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ కామధేను ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది.
ఈ గిరిప్రదక్షిణశ్రీ కామధేను ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాళ నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమముల నడుమ తిరిగి ఆలయానికి చేరుకుంది..