తిరుమల, ప్రభన్యూస్ ప్రతినిధి: వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్ధం విచ్చేస్తున్న భక్తులు ఓపిగా ఉండాలని, అలాగే విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కులుగకుండా టిటిడి అన్ని విభాగాలు సేవలందిస్తున్నాయని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మాట్లాడారు. తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో శ్రీవారి దర్శనం కోసం దాదాపు రెండు రోజుల పాటు వేచివుండాల్సి వస్తుందని అటువంటి సమయంలో భక్తులు ఓపిగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జూలై 15 వ తేది వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామ్నారు. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారన్నారు.
ఇటీవల కాలంలో మే 29 వతేదిన అత్యధికంగా 92 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని, టిటిడి సిబ్బందితో పాటు పోలీసులు, విజిలెన్స్, అండ్ సెక్యూరిటి సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేసి భక్తులకు చక్కటి సేవలు అందించారని చెప్పారు. అలాగే తిరుమలలో వసతి సమస్య ఉందని వసతి లభ్య కంటే వస్తున్న భక్తుల సంఖ్య రెట్టింపుగా ఉండడంతో కొండ పై గదులు దొరికే అవకాశం తక్కువ అన్నారు. స్లాటెడ్ సర్వదర్శానాన్ని ఆన్‌లైన్‌లో కేటాయిస్తేనే విజలు అవుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఇదే సమన్వయంతో పనిచేసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా సనాతన హైంధవ ధర్మప్రచారంలో భాగంగా టిటిడి దేశ వ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాలలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోంది. ఇటీవల విశాఖపట్నం, భువనేశ్వర్‌లో నిర్మించిన శ్రీవారి ఆలయాలలో ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.
ఇక అమరావతిలో టిటిడి నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 4 నుంచి 9 వ తేది వరకు జరిగాయని చెప్పారు. అదేవిధంగా ఆగస్టు 7 వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణమస్తు నిర్వహిస్తున్నామని పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్దికంగా భారం కాకూడదెనే ఉద్దేశ్యంతో ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహించాలని టిటిడి బోర్డు నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఆగస్టు 7 న కళ్యాణమస్తు పేరుతో పెద్ద ఎత్తున ఉచిత సామూహిక వివాహలు నిర్వహించనున్నామని తెలిపారు. ఇందుకు ఆయా జిల్లాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. శ్రీశుభకృత్‌నామ సంవత్సరం దశమి ఆదివారం ఉదయం 8.7 గంటల నుంచి 8.17 గంటల మధ్య టిటిడి పండితులు సుముహూర్తం నిర్ణయించారన్నారు. కరోనా కారణంగా నిలిచిన ఈ సామూహిక వివాహాలను పున: ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు. తద్వారా ఎన్నో కుటుంబాలు తమ పిల్లలకు స్వామివారి ఆశీస్సులతో వివాహాలు చేసుకునే చక్కటి అవకాశం కలుగుతుందని వ్యక్తం చేశారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుంచి 10 వ తేది వరకు జరిగాయని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.