Tuesday, November 26, 2024

శివాల‌యాల‌కు పోటెత్తిన భ‌క్తులు

తూర్పు గోదావ‌రి జిల్లా మండపేటలో శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం, అందులోనూ తొలి సోమవారం కావడంతో విశేష పూజ‌లు చేశారు భ‌క్తులు. మండపేట నియోజకవర్గంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధ శ్రీ అగాస్తేస్వరా జనార్ధన్ స్వామి (రథం గుడి), ఏడిద సంగమేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మండవ్య మహా ముని స్నాన ఘట్టం పెద్ద కాల్వ వద్ద, సంగంలోని త్రివేణి సంగంలోనూ వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించారు.

ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. సూర్యోదయానికి ముందే పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. ఇక సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. అక్కడ ఉన్న త్రివేణి సంగమం తటకంలో భక్తులు స్నానాలు చేశారు. నంది విగ్రహం వద్ద దీపారాధనలు చేశారు. మహిళలు ఉపవాసంతో స్వామివారికి దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం పంచమూర్తులైన గణపతి, సోమస్కంధుడు, వళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, చండికేశ్వరుడు, త్రిశూలానికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. నెల రోజుల పాటు నిర్వహించే విశేష పూజ, హోమ మహోత్సవాలకు  అంకురార్పణ చేశారు. ప్రతి శివాలయంలో కార్తీక సోమవార ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement