తిరుమలకు శ్రీవారి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఒకవైపు వీకెండ్. మరోవైపు రేపటి నుంచి స్కూళ్లు ఓపెన్ కానుండడంతో మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం, నారాయణగిరి క్యూకాంప్లెక్స్‌లు అన్ని భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సేవా సదన్ వరకు క్యూలైన్లలో భక్తులు నిలబడి ఉన్నారు. క్యూలైన్లు పెరుగుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.
క్యూ లైన్లలో వేచియున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రతీ సెక్టార్‌కు ప్రత్యేక అధికారులను కేటాయించామని… భక్తులకు ఎప్పటికప్పుడు అన్న, పానీయాలు అందజేస్తున్నామని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఫారసు లెటర్స్ ద్వారా ఇచ్చే బ్రేక్ దర్శనాలను, వారాంతపు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.