( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : విజయవాడలో ఇవాళ ఉదయం స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజన్ 2047 కార్యక్రమం జరుగుతుండగా మరోవైపు వైసీపీ కేంద్ర నాయకత్వం పిలుపు ఇచ్చిన రైతుకు అండగా కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ని పోలీసులు ముందుకు వెళ్లకుండా నిలువరించారు.
వైసీపీ కార్యక్రమానికి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకోవడంతో నడిరోడ్డు మీద దేవినేని అవినాష్ నిరసనకు దిగారు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వివాదంతో పాటు స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ జీపు ఎక్కించి తీసుకువెళ్లారు. పోలీసుల తీరును తప్పుబట్టిన అవినాష్ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు అండగా నిలవడం తప్పా అంటూ పోలీసులను అవినాష్ ప్రశ్నించారు. అవినాష్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు జీపుల్లో వేరే ప్రాంతానికి తరలించారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా పోలీసులు సమాధానం చెప్పాలంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.