విశాఖపట్నం, (ప్రభ న్యూస్ బ్యూరో): ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రాజధాని విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయం రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించామని అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా నేడు ఆయన జీవీఎంసీ వీఎంఆర్డీఏకి చెందిన దాదాపు రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ‘విజన్ విశాఖ’ పేరుతో వైజాగ్ లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు రెండు వేల మందికి పైగా పారిశ్రామికవేత్తలు హజరయ్యారు..
ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని అన్నారు. తాము తీసుకుంటున్న చర్యల వల్ల . హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి జరుగుతోందని సీఎం తెలిపారు.ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని.. అభివృద్దిలో విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందంటూ . గత పదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
ఏపీలో నిరుద్యోగం తగ్గింది
ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. డీబీటీ పద్దతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నామని అన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయానికి ఏపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. సముద్రతీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని.. ఉపాధి అవకాశాల పెరిగాయని జగన్ చెప్పారు..
అంతకుముందు రెండు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం విశాఖపట్టణం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఉదయం తాడేపల్లి నుంచి విశాఖ విమాశ్రయం చేరుకొని అక్కడ నుంచి 10:27 గంటలకు బయలుదేరి మధురవాడ ఐటీ హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకున్నారు. ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయం వద్ద, హెలిప్యాడ్ వద్ద అధికారులు, రాజకీయ ప్రముఖులు పుష్పగుచ్ఛాలు అందజేసి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.విశాఖపట్టణం విమానాశ్రయం వద్ద ఇంఛార్జి మంత్రి విడదల రజని, ఎంపి ఎం.వి.వి. సత్యనారాయణ, విప్ కరణం ధర్మశ్రీ, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, వి.ఎం.ఆర్. డి. ఎ. ఛైర్మన్ సనపల చంద్రమౌళి, డీసీసీబి ఛైర్మన్ కోలా గురువులు, డీసీపీ సత్తిబాబు తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.