అక్కడ రూల్స్ కంటే.. ఆచారమే గెలిచింది. ఏటా జరిగినట్టే ఈ సారి కూడా కర్రలు కర్రలు కలబడ్డాయి. సంబురంగా జరిగిన దసరా ఉత్సవం కాస్త చివరికి హింసగా మారింది. దీంతో దాదాపు 100 మందికి పైగా తలలు పగిలి ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లు అంటున్నారు..
కర్నూలు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావించే కర్రల సమరంతో దేవరగట్టు రక్తమోడింది. అడుగడుగునా పోలీసు ఆంక్షలున్నా ప్రజలు కర్రతలతో కొట్టుకున్నారు. ఈ హింసలో చాలామంది తలలు పగిలాయి. దసరా నాడు ప్రత్యేకంగా నిలిచే దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రలో చెలరేగిన హింసలో దాదాపు వంద మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. క్షతగాత్రులను ఆదోనిలోని హాస్పిటల్‌కు తరలించారు.
దేవరగట్టు కొండ మీద ఉన్న మాళ మాల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్ల కల్యాణం తర్వాత దసరా జైత్రయాత్ర ప్రారంభమైంది. కల్యాణానికి ముందు నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపై నుంచి ఉత్సవ విగ్రహాలను భక్తులు పల్లకిలో జైత్రయాత్ర కోసం కిందకు తీసుకువచ్చారు. ఏటా జరిగినట్టుగానే ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో హింస చెలరేగింది. కాగా, బన్నీ ఉత్సవంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అంతకుముందు వరకు అంటే సాయంత్రం దాకా హింసను నిరోధించేందుకు పకడ్బంధీగా చర్యలు తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు.
బన్నీ ఉత్సవంలో హింస జరగకుండా ఆంక్షలు విధించినట్టు పోలీసులు చెప్పారు. కానీ, ఒక్కసారిగా కర్రల కొట్లాట మొదలుకాగానే గమ్మునుండిపోయారు. దీంతో ఈసారి కూడా హింస తప్పలేదు. ఇప్పటికీ.. ఈ ఉత్సవంపై మానవ హక్కుల కమిషన్‌తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయ్యింది.
దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలకు చెందిన వారు ఓ వైపు.. అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాలకు చెందిన భక్తులు మరోవైపు కర్రలతో తలపడ్డారు. సమరం ప్రారంభమైన కాసేపటికే హింసాత్మకంగా మారింది.
ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారన్న సంగతి తెలిసిందే. అయితే.. హింసను ఈసారి నిరోధించేందుకు పోలీసులు సరైన సమయంలో పకడ్బంధీగా చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ప్రతి ఏటాలానే వంద మందికిపైగా తలలు పగిలాయి.