Sunday, November 17, 2024

Devara : కుమారుడి ఆఖ‌రి కోరిక తీర్చండి.. ఓ త‌ల్లి మొర..

ఆ యువకుడు జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న అతను.. తాను చనిపోయే లోపు తన అభిమాన నటుడి సినిమా ‘దేవర’ చూసి చనిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో తమ బిడ్డ ఆఖరి కోరిక తీర్చాలని ఆ యువకుని తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు. ఏపీకి చెందిన కౌశిక్ (19) కొద్ది రోజులుగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ చూడాలని తన బిడ్డ కోరుకుంటున్నట్లు.. అప్పటివరకూ అతన్ని బతికించాలని వైద్యులను వేడుకుంటున్నట్లు కౌశిక్ తల్లిదండ్రులు తెలిపారు.

కాగా, యువకుడి తండ్రి శ్రీనివాసులు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరులోని కిడ్వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. కౌశిక్ తల్లిదండ్రులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా కుమారుడు చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఇప్పుడు కూడా చివరి కోరికగా ‘దేవర’ సినిమా చూడాలని అడుగుతున్నాడు. సెప్టెంబర్ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు.

ఇది అతని ఆఖరి కోరిక.’ అంటూ కౌశిక్ తల్లి సరస్వతి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుని వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చవుతుందని.. ప్రభుత్వం, దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు. తమ కొడుకు చివరి కోరిక తీర్చాలని తాము ప్రయత్నిస్తున్నామని.. తమకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమకు సాయం చేయాలని కోరుతున్నారు.

- Advertisement -

ఇప్పటికే స్నేహితులు, సన్నిహితుల ద్వారా కొంత డబ్బు సమకూరినా ఇంకా డబ్బు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తున్న తారక్ అభిమానులు ఆయన్ను ట్యాగ్ చేస్తున్నారు. కాగా, తనను ప్రేమించే అభిమానులన్నా, వారి కుటుంబ సభ్యులన్నా తారక్ ఎంతో అభిమానం, ప్రేమను కనబరుస్తుంటారు. గతేడాది ఓ అభిమాని తన తల్లికి ఆయనంటే ఎంతో ఇష్టమని చెప్పగా.. తారక్ ఆమెతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆ అభిమాని కోరిక తీర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement