అమరావతి, ఆంధ్రప్రభ : దేశ ప్రయోజనాలను, రక్షణను ఫణంగా పెట్టే ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా శాంతియుత ఆందోళన చేపట్టిన నిరసనకారులను పరామర్శకు వెళ్ళిన వామపక్ష నాయకులను అరెస్టు చేసి నిర్బంధించడం గర్హనీయమని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. విజయవాడలో యువజనులతో సమావేశమవుతున్న యువజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి రాత్రంతా ఒకచోట నుండి మరోచోటకు పోలీసుస్టేషన్లకు క్రిమినల్స్‌ను తిప్పినట్టు తిప్పడం హేయమని ఆయా పార్టీల నేతలు మండిపడ్డారు. అరెస్టయినవారందరిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని లేదంటే అరెస్టులను ఖండిస్తూ రాష్ట్రవ్యాపిత నిరసనలకు పిలుపు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ(యంఎల్) న్యూడెమోక్రసీ, సిపిఐ(యంఎల్) యంసిపిఐ(యు), సిపిఐ(యంఎల్) లిబరేషన్, యస్‌యుసిఐ(సి), ఫార్వర్డ్‌బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీలకు చెందిన అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టయినవారిని ఇంకా విడుదల చేయకపోగా పోలీసులు సెల్ఫోన్లు లాక్కొని వారిపై దురుసుగా ప్రవర్తించడం తీవ్ర అభ్యంతరకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టయిన వారిని రాత్రి 11 గంటలకు పరామర్శకు వెళ్ళిన నాయకులను, కార్యకర్తలను కూడా నిర్బంధించి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అదేవిధంగా పోలీసు నిర్భంధంలో ఉన్నవారిని శనివారం పరామర్శించేందుకు వెళ్ళిన రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు, సిపి ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావులను కూడా చందర్లపాడు స్టేషన్లో నిర్బంధించి అరెస్టు చేయడం మరింత దుర్మార్గమని, వయోభారంతో ఉన్నారని చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తాము నిరసిస్తునానమని అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాతంత్రవాదులు అరెస్టులను ఖండించాలని కోరారు. ఈ నిర్బంధానికి రాష్ట్ర ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలని, వైసిపి ప్రభుత్వం అగ్నిపథ్‌పై తన వైఖరిని వెల్లడించాలని, తెలుగుదేశం, జనసేన కూడా తమ వైఖరిని ప్రకటించాలని, దేశ యువత నిరసిస్తున్న అగ్నిపథ్‌ను వ్యతిరేకించాలని డిమాండు చేశారు. దేశవ్యాపితంగా నిరసనలు వ్యక్తమవుతున్నా బిజెపి ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పూనుకుంటు-న్నదే తప్ప పున:పరిశీలన చేయకపోవడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా నిరసిస్తున్నాయని అన్నారు. సమావేశంలో పాల్గొన్న సిపి ఎం కేంద్ర కమిటీ- సభ్యులు యం.ఏ.గఫూర్, సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్, సిపిఐ(యం ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోలారి మిగిలిన వామపక్ష పార్టీలు తమ ఆమోదాన్ని తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.