(ప్రభ న్యూస్, విజయవాడ) : మాజీ మంత్రి దేవినేని నెహ్రూ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. విజయవాడలోని ఏపీఐఐసీ కాలనీ రైతుబజార్ వద్ద ఉన్న మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం నగరంలో కలవరపాటుకు గురిచేసింది. సమాచారం అందుకున్న నెహ్రూ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని, శుక్రవారం ధ్వంసం చేసిన చోటే మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాక్షస రాజకీయం పెరిగిపోయిందన్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అనే ప్రశ్న తలెత్తే విధంగా కూటమిపాలన సాగుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) విగ్రహాలను ధ్వంసం చేయటం కూటమినేతల పిచ్చికి పరాకాష్ట అని అన్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు.
విగ్రహాలను ధ్వంసం చేయగలరు కానీ, ప్రజల గుండెల్లోని అభిమానాన్ని తొలగించగలరా అని ప్రశ్నించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు అధికారం ఇచ్చారని, దాన్ని సద్వినియోగ పరుచుకోవాలి.. కానీ రాక్షస క్రీడ సాగించకండనీ హితవు పలికారు. విగ్రహాల ధ్వంసంపై పటమట పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.