Saturday, January 4, 2025

AP | మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

• కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
• ప్రతి మండలంలో మూడు రోజులపాటు సేవలు అందించనున్న మొబైల్ వ్యాన్

కృష్ణా జిల్లాలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వ‌ద్ద ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి తక్షణం చికిత్స అందించేందుకు ఈ వాహనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప‌వ‌న్ క‌ళ్యాన్ అన్నారు.

ఈ వాహనం కృష్ణా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రజలకు సేవలంచనుంది. వారంలో మూడు రోజుల పాటు మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి అల్ట్రాసౌండ్, మామోగ్రామ్, రక్త పరీక్షలు, ఎక్స్‌రే, కెమికల్ అనాలిసిస్, కోలనోస్కోపీ వంటి పరీక్షలు ఈ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా ఉచితంగా నిర్వహించ‌నున్నారు.

మహిళల్లో క్యాన్సర్ లక్షణాలను గుర్తించేందుకు నివారణ చర్యల్లో భాగంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా ఏడాదికి 40 వేల మరణాలను అరికట్టవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.

కాగా, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి చొరవతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రూ.2 కోట్ల నిధులతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసింది. సామాజిక బాధ్యతతో ప్రజల కోసం ఈ వాహనాన్ని ఏర్పాటు చేసిన భెల్ కంపెనీ ప్రతినిధులను, చొరవ చూపిన ఎంపీ వల్లభనేని బాలశౌరి ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement