అమరావతి: తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపిక కావడం హర్షణీయమని తెలిపారు. మరిన్ని సేవలందిస్తూ ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కృష్ణతేజ త్రిస్సూర్ కలెక్టర్‌గా పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ఆయన ఉత్తమ విధానాలు అనుసరించారని గుర్తుచేశారు.
కరోనా, కేరళ వరదల విపత్తుల సమయంలో ఆయన అందించిన సేవలను ప్రజలు మరచిపోలేదని పవన్ తెలిపారు. తెలుగుతేజం, ఐఏఎస్ అధికారి ఎం.వి.ఆర్.కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు. బాలల హక్కుల రక్షణలో దేశంలోనే త్రిసూర్ జిల్లాను అగ్రగామిగా నిలపడంతో జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు.
27న ఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అయిన కృష్ణతేజ 2023 మార్చిలో కేరళ రాష్ట్రం త్రిసూర్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారు ఉన్నత చదువులు చదివేలా చూశారు. అలాగే కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35మంది వితంతువులకు ఇళ్లు నిర్మింపజేశారు. మరో 150 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు.