Thursday, November 7, 2024

AP | 4, 5వ‌ తేదీల్లో పిఠాపురంలో ఉపముఖ్యమంత్రి పర్యటన..

కాకినాడ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఈ నెల 4, 5తేదీల్లో సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌ మండలాల్లో వివిధ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు. అధికారుల్తో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు.

అలాగే పార్టీ కార్యకర్తల్తోనూ, కూటమి నాయకుల్తోనూ ప్రత్యేకంగా బేటీ అవుతారు. ఇటీవల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలోని కూటమి నాయకుల అంతర్గత విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. ప్రభుత్వ లేదా పార్టీ లకు చెందిన ఏ కార్యక్రమం అమలు కూడా సక్రమంగా సాగడంలేదు.

ప్రతిచోట ఇరుపార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమౌతోంది. ఈ క్రమంలో ఇరుపార్టీల కార్యకర్తలు అనేక ఇబ్బందులకు లోనౌతున్నారు. నాయకుల మధ్యనున్న అహంభావం కార్యకర్తల్లో భవిష్యత్‌ పట్ల భయాన్ని కలిగిస్తోంది. సాక్షాత్తు సొంత నియోజకవర్గంలోనే పరి స్థితులిలా ఉండడంతో అందుక్కారణమైన వ్యక్తులపై పవన్‌ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తొంది.

మరీ ముఖ్యంగా రెండ్రోజుల క్రితం పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో కండువాలకు సంబంధించి నెలకొన్న వివాదం రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచింది. అటు టిడిపి ఇన్‌చార్జ్‌ వర్మ, ఇటు జనసేన ఇన్‌చార్జ్‌ మర్రెడ్డి శ్రీనివాస్‌ ఇద్దరూ ఈ వివాదాన్ని నియంత్రించలేక పోయారు.

దీంతో ఓట్లడిగేందుకొచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్ధి రాజశేఖర్‌ కూడా అక్కడ్నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పవన్‌ సేకరించారు. ఇలా రోడ్లపై పడ్డం ద్వారా ప్రజలకెలాంటి సందేశాలివ్వాలని భావిస్తున్నది వారి ముందే తేల్చుకునేందుకు ఆయన సిద్దమయ్యారంటూ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement