మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తొలిసారిగా రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి నేటితో 100ఏళ్లు పూర్తి అయింది. 1922 ఆగస్టు 22 నుంచి 27 వరకు వరుసగా ఐదు రోజులపాటు అల్లూరి నేతృత్వంలో ఈ దాడులు చేశారు. తెల్లదొరలపై పోరాడేందుకు సంప్రదాయ విల్లంబులు సరిపోవని.. ఆధునిక ఆయుధ సామాగ్రి అవసరం అని తలచి చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు సేకరించాడు. చింతపల్లి దాడికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తపాలా శాఖ స్మారక స్టాంపును ఆదివారం ఆవిష్కరించనుంది.
వందేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు… బ్రిటిష్ సైనికులను ఎదుర్కోవాలంటే గిరిజనుల వద్ద ఉన్న సంప్రదాయ విల్లంబులు, ఆయుధాలు సరిపోవని భావించి ఆధునిక ఆయుధాలను సమీకరించుకోవడం కోసం గిరిజనులతో కలిసి పోలీసు స్టేషన్లపై సాయుధ దాడులకు సిద్ధపడ్డారు. ఈ దాడుల్లో ఆయనతో పాటు ప్రధాన అనుచరులు గాం మల్లుదొర, గంటందొర, ఎండు పడాలు, ఎర్రేసులతో పాటు సుమారు 300 మంది నాటు తుపాకులు, కత్తులు, బల్లేలు, విల్లంబులతో దాడి చేశారు. ఆ సమయంలో చింతపల్లి స్టేషనులో కేవలం ముగ్గురు జవాన్లే ఉన్నారు. 1922 ఆగస్టు 22 నుంచి 27 వరకు వరుసగా ఐదు రోజులపాటు అల్లూరి నేతృత్వంలో ఈ దాడులు చేశారు. చింతపల్లి పోలీసు స్టేషన్‌పై చేసిన దాడి విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఆ మర్నాడే ఆగస్టు 23న కృష్ణదేవిపేట, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి, ఆ తర్వాత వరుసగా అడ్డతీగల, రంపచోడవరం స్టేషన్లపైనా దాడులు చేశారు.
ఇది కూడా చదవండిః విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు