అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రీ ఫైనల్ పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నాపత్రాలు యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడానికి కారణాలెవరనే అంశంపై అంతర్గత విచారణ జరుపుతోంది. మరోవైపు ప్రశ్నాపత్రాల ముద్రణ జిల్లా కామన్ పరీక్షల బోర్డ్‌ల ఆధ్వ్యర్యంలో జరుగుతాయి కనుక అన్ని జిల్లాలలో కేసులు నమోదు చేయించినట్లు- పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పరీక్షా పత్రాలను చట్ట విరుద్ధంగా పరీక్షకు ముందుగా యూట్యూబ్‌లో పెడుతున్న అనుమానితుని వివరాలను విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కనిపెట్టినట్లు సమాచారం ఉందన్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రశ్నా పత్రాలు అప్లోడ్ చేస్తున్న అనుమానితుడు కడపకు చెందిన వాడిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులకు ఉమ్మడి ప్రశ్న పత్రం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ ప్రశ్న పత్రాలను పరీక్షా ప్రారంభ సమయానికన్నా ముందుగా బహిర్గతం చేయడం, సామాజిక మాధ్యమాలలో ఉంచడం పరీక్ష నిర్వహణా చట్టాలకు విరుద్దమని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తొలుత ప్రశ్నాపత్రం వెలుగు చూసిన కడప పోలీస్ స్టేషన్‌లో, అలాగే అన్ని జిల్లాల్లో పోలీసులకు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ప్రశ్నాపత్రాల విషయంలో జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..