ఏపీలో కరోనాతో పోరాడుతున్న ప్రజల్ని ఇప్పుడు మరో మహమ్మారి భయపెడుతోంది. ఓవైపు కరోనా వైరస్.. మరోవైపు డెంగ్యూతో ప్రజలు ఆస్పత్రుల పాలవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. పారిశుధ్య నిర్వహణ గాడి తప్పడం, అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో డెంగ్యూ జ్వరము కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. తాజాగా కర్నూలులో డెండ్యూతో ఓ బాలిక మృతి చెందింది.
అవుకు మండలంలోని సింగనపల్లె గ్రామంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలతో గురుచంద్రిక(8) అనే బాలిక చనిపోయింది. కర్నూల్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో ఎన్నో రోజుల నుంచి పారిశుద్ధ్యం పేరుకుపోవడంతోపాటు,దీనికి తోడు తరచుగా వర్షాలు కురవడంతో దోమలు ఎక్కువ వ్యాపించడంతో పాటు గ్రామంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపించినట్లు వైద్యాధికారి జయేంద్ర రెడ్డి తెలిపారు. గ్రామంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపించడంతో గ్రామాన్ని ఉన్నతాధికారులు సందర్శించనున్నారు.