రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో భాగంగా.. ఆలయాలను కూల్చివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గుడిని ధ్వంసం చేశారని మండిపడుతున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో జరిగింది. పాతపట్నంలోని నీలమణి దుర్గ ఆలయం ప్రాంగణం తొలగింపుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైల్వే వంతెన నిర్మాణంలో భాగంగా.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయ ముఖద్వారం, వినాయక ఆలయం, ప్రహరీ గోడను కూల్చి వేయడమేంటని మండిపడ్డారు. ఈ ఆలయాలతో పాటు సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం, వినాయక ఆలయాన్ని పూర్తిస్థాయిలో తొలగించారని ఆవేదన చెందారు.
కనీసం విగ్రహాన్ని భద్రపరిచేందుకూ సమయం ఇవ్వలేదని వాపోయారు. దేవతా మూర్తుల విగ్రహాలతో పాటు విలువైన సామగ్రిని సైతం ధ్వంసం అయినట్లు ఆలయ పూజారులు తెలిపారు.