అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ సీరియస్
వీఎంఆర్డీయేకి దరఖాస్తుతో సరి
వైసీపీ కార్యాలయ ఇన్‌చార్జికి నోటీసులు
అనకాపల్లిలో ఎకరాకు ఏటా ₹1000 లీజు
ఇక బందరులోనూ ఇదే స్థితి
ఆంధ్రప్రభ స్మార్ట్, ( విశాఖపట్నం / మచిలీపట్నం ప్రతినిధి) – గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలోని వైసీపీ ప్రదాన కార్యాలయాన్ని సీఆర్డీయే కూల్చిన కొన్ని గంటల్లోనే.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. కారు చౌక లీజుతో ప్రభుత్వ భూముల్లో పాగా వేసిన వైసీపీ కార్యాలయాల తొలగింపునకు నడుము కట్టాయి. అంతే ఏపీలో వైసీపీ నేతలు కోర్టుల తలుపులు తట్టటానికి వీలుగా…వారం రోజులు సమయం కోరుతున్నారు. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లిల్లో వైసీపీ కార్యాలయాలపై విశాఖ జీవీఎంసీ దృష్టి సారించింది. తమ ఆక్రమణల నిరోధక స్క్వాడ్ ను రంగంలోకి దించింది. అంతే… విశాఖ వైసీపీ నేతలు బిక్కచచ్చిపోయారు. వారం రోజుల సమయం కావాలని అధికారులను కోరారు.
ఎకరం లీజు రూ.1000లే
విశాఖ సిటీ ఎండాడ గ్రామంలో రెండు ఎకరాల స్థలాన్ని వైసీపీ ఆఫీసుకు జీవీఎంసీ అధికారులు కేటాయించారురాజకీయ నాయకులు, పైగా అధికార పార్టీ నేతలు కావడంతో ప్రజా సేవ చేస్తున్నారని భావించి ఎకరం వెయ్యి రూపాయల కే ఇచ్చేశారు. అక్కడ వైసీపీ కార్యాలయాన్ని దాదాపు కట్టేశారు. తుది మెరుగులు దిద్దుతున్నారు. సర్వే నంబర్ 175/4లో ఎలాంటి అనుమతులు లేవని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.సాధారణంగా విశాఖ నగర పరిధిలో భవనాల నిర్మాణానికి జీవీఎంసీ నుంచి అనుమతులు పొందాలి. వీఎంఆర్డీఏకు కలెక్టర్ వైస్ ఛైర్మన్‌గా ఉండడంతో ఆ పని తేలికైంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే అధికారులు రంగంలోకి దిగేశారు. ఎండాడలోని వైసీపీ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఈ భవనానికి ప్లాన్ ఉందా అని ఆరా తీశారు. ఈ భవనం పనుల గురించి ఏమైనా మాట్లాడాలంటే ఫలానా వ్యక్తితో మాట్లాడాలని వైసీపీ ఇన్‌ఛార్జ్ పేరు చెప్పారు.ఎలాంటి అనుమతి లేకుండా భవనాన్ని కట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. జిల్లా అధికారుల సలహాతో అదే రోజు వైసీపీ నేతలు సుమారు రూ. 14 లక్షలు చెల్లించారు. దీంతో ఆ భవనానికి సంబంధించి పేపర్లపై దిగువ స్థాయి నుంచి క్లియరెన్స్ వచ్చింది. మరో అధికారి వద్దకు వెళ్లింది. ఈలోగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదుతో వీఎంఆర్డీయే టౌన్ ప్లానింగ్ అధికారులు ఆయా దస్త్రాలపై సంతకాల పెట్టకుండా నిలిపివేశారు.
జీవీఎంసీ నోటీసులు
ఎండాడ లోని సర్వే నంబర్ 175/4 లో 2 ఎకరాలలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారనిజీ వీ ఎం సీ అభ్యంతరం వ్యక్తం చేస్తే… జీవీఎంసీని కాదని వీ ఎం ఆర్డీయేకు దరఖాస్తు చేసి., అక్కడా అనుమతులు రాకుండానే ఎలా నిర్మాణాలు పూర్తి చేశారని జీవీఎంసీ జీ వీఎం సీ వివరణ కోరింది. వారం లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికిజోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నోటీసులు అంటించారు. ఇది సరే… ఇక అనకాపల్లిలోమరో వైసీపీ ప్యాలెస్ కథపై వీఎంఆర్డీయే దృష్టి సారించింది. జీవీఎంసీ అనుమతులు లేకుండా హైవే సమీపంలో 33 ఏళ్లకు లీజుకు తీసుకున్న 1.75 ఎకరాల భూమిలో వైసీపీ కార్యాలయానికి అప్పటి ప్రభుత్వం దారాదత్తం చేసింది. ఎకరానికి ఏటా కేవలం రూ.1000 లీజు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యహహారంపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
మచిలీపట్నంలోనూ అలజడి
కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో అధునాతన సదుపాయాలతో నిర్మాణం పూర్తి కావొచ్చిన వైసీసీ కార్యాలయం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడి మున్సిపాలిటీలో మూజువాణి ఓటుతో పోలీసు గ్రౌండ్ లోని రెండు ఎకరాల స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం చేపట్టారు. నిజానికి ఈ భూమి పోలీసు శాఖది. పోలీసు శాఖపై ఒత్తిడి తెచ్చి.. పురసాలక సంఘం పాలక మండలి అనుమతితో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ భూమిపై నిజానికి పురపాలక సంఘానికి అధికారం లేదు. పైగా 99 తొమ్మిదేళ్లు లీజుకు ఇస్తూ పురపాలక సంఘం పాలక మండలి ఆమోదం తెలనటం అభ్యంతరకరమని అప్పట్లో టీడీపీ వాదించింది. కానీ అధికార బలంతో ఈ భూమిని వైసీపీ స్వాధీనం చేసుకుంది. ఇదే స్థలంలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో భోగరాజు సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి యూనియన్ బ్యాంకు ముందుకు వస్తే భూమి ఇవ్వలేదు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంపీ బాలశౌరి కృషి చేశారు. కానీ బాలశౌరిపై వ్యతిరేకతతో అప్పటి ఎమ్మెల్యే పేర్నినాని అడ్డుకున్నారు. ఈ స్థితిలో బందరు పోలీసు పేరేడ్ గ్రౌండ్ లో వెలిసిన వైసీపీ కార్యాలయంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం.