Friday, November 22, 2024

AP: గుంటూరు మిర్చికి మస్త్​ గిరాకీ, కోల్డ్​ స్టోరేజీల్లో నిల్వలు ఖాళీ.. మేలు రకం క్వింటా రూ.31వేలు

గుంటూరు, ప్రభన్యూస్‌బ్యూరో: గుంటూరు మిర్చికి అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. మిర్చి దిగుబడులపై తెగుళ్ళ ప్రభావం దిగుబడిపై చూపినా.. ధరలు ఎగబాకడంతో రైతులు, వ్యాపారులకు లాభాలపంట పండింది. రైతుల వద్ద ఉన్న మిర్చి సరుకులో మూడొంతులు విక్రయాలు జరిగిన తర్వాత మార్కెట్‌ ఊపందుకోవడం కొంతమేర బాధాకరం. రైతుల వద్ద నుంచి వ్యాపారుల చేతుల్లోకి మారిన తర్వాత శీతలగిడ్డంగులో సరుకు రేటు అమాంతంగా పెరిగింది. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మర్చియార్డుకు ఒక గుంటూరు జిల్లా నుంచే కాకుండా పల్నాడు, తెలంగాణ జిల్లాల నుంచి సరుకు దిగుమతి అవుతోంది.

ఇక్కడ స్పైసెస్‌పార్కులో లావాదేవీలు జరడగం వ్యాపారులకు మరింత కలిసొచ్చిన అంశంగా చెప్పవచ్చు. పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలోని మైదవోలులో 125 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సుగంధ ద్రవ్యాల పార్కు ఫలాలు అందుతున్నాయి. పార్కులో సుమారు రూ.120 కోట్ల వ్యయంతో పలు ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పడంతో ఎగుమతులకు మార్గం సుగమమైంది. సాధారణంగా ప్రతి ఏడాది సీజన్‌లో 30శాతం వరకు మర్చిని ఆశించిన రేటుకోసం శీతలగిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లోని వందకుపైగా ఉన్న శీలగిడ్డంగుల్లో ఉన్న పదిలక్షల క్వింటాళ్ళ మిర్చి పూర్తిస్థాయిలో విక్రయాలు జరగడం ఇదే తొలిసారి అని వ్యాపారులు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌
కొద్ది రోజులుగా ధరలు పెరుగుతున్నా ఈ ఏడాది సీజన్‌లో గరిష్టంగా రూ.18 వేలు దాటలేదు. ఇప్పుడు అన్‌ సీజన్లో రికార్డు స్థాయిలో ధరలు పెరగడం విశేషం. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా తామర తెగులు సోకి పంట దెబ్బతినీ, దిగుబడి తగ్గడం వల్ల కొన్ని రోజులుగా గుంటూరు మిర్చికి ఇతర రాష్ట్రాల్లో గిరాకీ పెరిగింది. రాష్ట్రంలోని వివిధ కోల్డ్‌ స్టోరేజీల్లో ఇంకా 10 లక్షల టిక్కీలు నిల్వ ఉన్నాయి. కొత్త సరుకు రావడానికి ఇంకా రెండు నెలలు సమయం ఉంది. దీంతో గతేడాది సాగు చేసిన మిర్చిని కోల్డ్‌ స్టోరేజీల్లో దాచుకున్న వ్యాపారులు లాభపడ్డారు.

గతేడాది ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టు-కొని రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి విస్తీర్ణం 30 శాతం వరకు తగ్గింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాల్లో సాధారణ విస్తీర్ణం కాగా ఈ ఏడాది ఇప్పటి వరకూ 1.40 లక్షల ఏకరాలోనే సాగైంది. ఈ ఏడాది ధరలు గణనీయంగా పెరుగుతున్నా మిర్చి సాగుకు రైతులు ఆచి తూచి వ్యవహరించారు. మరోవైపు ఇప్పటికే దాదాపు 10 వేల ఎకరాల్లో వర్షాలకు పైరు దెబ్బతింది. పల్నాడు జిల్లాలో కూడా కొంత మంది రైతులు మరో నెల రోజులు ఆగిన తర్వాత మిర్చి సాగు వైపు దృష్టి సారించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

- Advertisement -

ప్రధానంగా అధిక వర్షాలతో ఇబ్బందులు రాకుండా, ఎండ తీవ్రత పెరిగితే తెగులు ప్రభావం అంతగా ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గుంటూరు మిర్చి యార్డులో బుదవారం ధరలు గణనీయంగా పెరిగాయి. 355 రకం క్వింటాళ్‌ రూ.31000 పలికింది. 5531 రకం రూ.30 వేలు, దేవదారు డీలక్స్‌ రూ.29,500, 273 రకం రూ.29 వేలు, నంబర్‌ 5 రకం రూ.29,000 ధర పలకగా 334 సూపర్‌ వెరైటీ- రూ.27,500, నంబర్‌ 5 రకం రూ.29 వేలు, 334 సూపర్‌ వెరైటీ- రూ.27,500, తేజ రకం రూ.23,700, ఆర్మూర్‌ రూ.23,500 ధరలు పలికాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement