అమరావతి, ఆంధ్రప్రభ: ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాలకు వచ్చిపోతున్న విద్యార్థులతో ఆయా కళాశాలలు కళకళలాడుతున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించిన విద్యార్థులు ఈనెల 24 నుంచి 27 మధ్య వచ్చి రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యాశాఖాధికారులు ఆదేశించారు. దీంతో 70 శాతం మంది విద్యార్థులు సోమవారమే రిపోర్టు చేశారని కళాశాల వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏఏ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటున్నాయో తెలుసుకుని ఆయా కోర్సుల్లో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకోసం గతేడాది ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివిన విద్యార్థుల్లో ప్రాంగణ నియామకాలకు ఎంతమంది ఎంపికయ్యారు, వారిని ఎంపిక చేసుకున్న కంపెనీలు, వారికి ఇచ్చే ప్యాకేజీ వివరాలను తెలుసుకుంటున్నారు. దీంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు ప్రతి ఒక్కరికీ ఈ అంశాలు చెప్పేకంటే పెద్ద పెద్ద ప్లెక్సీలు వేసి కళాశాల ముందు పెట్టడం మంచిదని గుర్తించి ఆ పనిచేస్తున్నారు. ఇది ఒక రకంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతోపాటు తమకు ప్రకటనగా కూడా భావించి ఆమేరకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 370కుపైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఏపీ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా 85 శాతం కళాశాలల్లోనూ, జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా 10 శాతం కళాశాలల్లోనూ, మరో 5 శాతం కళాశాలల్లో ఇతర పోటీ పరీక్షల ఆధారంగానూ సీట్లను కేటాయిస్తున్నారు. వీటిలో రూ. లక్ష లోపు ఫీజులు వసూలు చేసే కళాశాలలు 4 శాతం ఉండగా రూ.లక్ష నుండి రూ.1 లక్షల వరకూ ఫీజు వసూలుచేసే కళాశాలలు 71 శాతం ఉన్నాయి. అలాగే, రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షలలోపు 19 శాతం, రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల లోపు 4 శాతం, 5 లక్షలకుపైబడి ఫీజులు వసూలుచేసే కళాశాలలు 2 శాతం వంతున ఉన్నాయి. అయినప్పటికీ ఫీజులను లెక్కచేయకుండా తమ పిల్లలను మంచి కళాశాలల్లో చదివించాలనే దృక్పథంతో తల్లిదండ్రులు ఆరాట పడుతున్నారు..
ఆ రెండు కోర్సులకే డిమాండ్
సీఎస్‌ఈ, ఐటీ తర్వాత ఒక మాదిరి ఎలక్ట్రాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఈసీఈ) విభాగంలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు. దీనితరువాత ఎలక్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విభాగంలోనూ ప్రవేశాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. కొవిడ్ తర్వాత సాఫ్ట్ వేర్ కొలువులకు మళ్లీ భూమ్ వచ్చినట్లు- అయింది. సీఎస్‌ఈ, ఐటీ కోర్సులు చదివిన వారికే రెండేళ్ల నుంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతో ఈ రెండు బ్రాంచిల్లో చేరటానికి విద్యార్థులు పోటీపడుతున్నారు. సాధ్యమైనంత వరకు ప్రతి కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో ఉన్న సీట్లన్నీ మొదటి విడత కౌన్సెలింగ్లోనే భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఐటీ బ్రాంచికి బాగానే విద్యార్థులు ఐచ్ఛికాలు ఇచ్చుకోవటంతో ఈబ్రాంచిలో సీట్లు మొదటి విడత కౌన్సెలింగ్లోనే 90 శాతం భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలు ఉండటం ఇవి చదివిన వారికి ప్రస్తుతం మార్కెట్లో ఉద్యోగావకాశాలు బాగా ఉండటంతో ఈసారి అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచిని ఎంపిక చేసుకున్నారని ఆయా కళాశాల్లో పనిచేస్తున్న లెక్చరర్లు చెబుతున్నారు. కన్వీనర్, యాజమాన్య కోటాల్లోని సీట్లు మొదటి విడతలోనే అయిపోయాయి.
అయితే ఈ బ్రాంచిల్లో సీట్లు వచ్చినా కొందరు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో రాలేదని, కొందరు తాము రెండో విడత కౌన్సెలింగ్‌కు వెళతామని కండిషనల్ జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మొదటి విడతలో సీట్లు వచ్చి వారు అనుకున్న కళాశాలలో సీటు రాకపోతే తొలుత జాయినింగ్ రిపోర్టు ఇచ్చి ఆ వెంటనే తాము సెకండ్ కౌన్సెలింగ్ వరకు వేచి చూస్తామని రాతపూర్వకంగా లేఖ అందజేస్తే వారికి సీటు ఉంటుంది. అలా కాకుండా తమకు మొదటి విడతలోనే సీటు కేటాయించారు కదా అని చెప్పి రిపోర్టు చేయకుండా ఉంటే ఆ సీటు ఆటోమెటిక్‌గా రద్దు అవుతుంది. దాన్ని తిరిగి రెండో కౌన్సెలింగ్‌కు క్లియర్ వెకెన్సీగా చూపుతారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో మొత్తం 1.50 లక్షలకుపైగా పలు విభాగాలకు సంబంధించిన సీట్లు ఉన్నాయి. వాటిలో 30 శాతం వరకూ సీఎస్‌సీ సీట్లు, 20 శాతం వరకూ ఐటీ సీట్లు ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా మొదటి విడత కౌన్సిలింగ్‌లోనే భర్తీ అవడం ఈ ఏడాది విశేషంగా చెప్పుకోవచ్చు.
టాప్ 10 కోర్సులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో 10 కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఇందులో కంప్యూటర్‌ఒ సైన్స్ 351 కళాశాలల్లోనూ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 344, మెకానికల్ 307, సివిల్ 302, ఎలక్ట్రికల్ 289, ఈసీఈ 147, ఐటీ 70, అగ్రికల్చర్ 20, కెమికల్ 18, ఇన్‌స్ట్రుమెంటేషన్ 10 కళాశాలల్లోనూ ఉన్నాయి. వీటిలో ఈసారి కంప్యూటర్, ఐటీ రంగాలకు చెందిన కోర్సులకు విద్యార్ధుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఆతరువాతి స్థానంలో ఈసీఈ, ఈఈఈలకు ఆదరణ ఉంది. ఇక మెకానికల్ కోర్సుకు ఆదరణ ఎప్పుడూ స్థిరంగానే ఉంటూ వస్తోంది.