అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల నాలుగో తేదిన ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై నిర్మలా సీతారామన్‌తో చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న అప్పుల నుంచి తేరుకొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన మద్దతును కోరడంతో పాటు రాష్ట్రానికి విరివిగా నిధులు అందించి అమరావతి, పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరనున్నట్లు సమాచారం.
ఇక ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని సైతం కలిసే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు కొనసాగుతోంది. శాఖల వారీగా సమీక్షలు, వివిధ రంగాల నిపుణుల ద్వారా బడ్జెట్ కేటాయింపు అంశాలపై చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటన కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, పోలవరానికి సంబంధించి అంతర్జాతీయ నిపుణులు పరిశీలించి ఒకట్రెండు రోజుల్లో నివేదికను కొలిక్కి తెచ్చి సీఎం చంద్రబాబు, కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది. దీంతో ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే విషయంపై కేంద్ర జలశక్తి అధికారులతోనూ చర్చించే అవకాశం కనబడుతోంది.