Tuesday, November 26, 2024

Delhi | రుషికొండ పిటీషన్ డిస్మిస్.. మేం జోక్యం చేసుకోం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలోని రిషికొండ నిర్మాణాలపై విజయవాడకు చెందిన పర్యావరణవేత్త లింగమనేని శివరామప్రసాద్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఈ అంశంపై ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌తో పాటు హైకోర్టులోనూ కేసు విచారణ జరుగుతున్నందున అక్కడే తేల్చుకోవాలంటూ పిటిషనర్‌కు తేల్చి చెప్పింది.

శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌లో ప్రజా ప్రయోజనాలు ఏమున్నాయని ప్రశ్నించింది. ఇది రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యంలా ఉందని, సుప్రీంకోర్టు రాజకీయాలకు వేదిక కాదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిని రిషికొండకు వెళ్లొద్దంటారా అంటూ ధర్మాసనం నిలదీసింది.

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ ఇందులో పర్యావరణ అంశాలున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ విచారణకు అనుమతించలేదు. పిటిషన్ సహేతుకంగా లేదని పేర్కొంటూ డిస్మిస్ చేశారు. పిటిషన్ పూర్వాపరాల్లోకి వెళ్తే.. విశాఖలోని రిషికొండపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలపై ప్రతిపక్షాలు మొదటి నుంచి విమర్శలు చేస్తున్నాయి.

గతంలో హరిత బీచ్ రిసార్ట్ పేరుతో ఉన్న నిర్మాణాలను తొలగించి అక్కడ పర్యాటక శాఖ చేపట్టిన నిర్మాణాల కోసం పరిమితికి మించి తవ్వకాలు జరిపారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై లింగమనేని శివరామప్రసాద్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ న్యాయపోరాటం ప్రారంభించారు.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 2015ను రద్దు చేయాలని కోరారు. రిషికొండపై తదుపరి ఎలాంటి నిర్మాణాలు జరపకుండా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై హైకోర్టులో ఒక కమిటీని నియమించింది. తదుపరి విచారణ నవంబర్ 29కి వాయిదా వేసింది. అక్కడ కేసు విచారణ పెండింగులో ఉండగా పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టులోనే తేల్చుకోవాల్సిందిగా సూచిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement