Sunday, November 10, 2024

AP | ఆన్‌లైన్‌ పేమెంట్ల జాప్యం.. మద్యం షాపుల వద్ద పరస్పర ఘర్షణలు!

అమరావతి, ఆంధ్రప్రభ: మద్యం షాపుల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులు వివాదాలకు దారితీస్తున్నాయి. నెమ్మదిస్తున్న నెట్వర్క్‌, పెద్ద ఎత్తున క్యూలతో మద్యం కోసం వచ్చే వారు ఘర్షణలకు దిగుతున్నారు. యూపీఐ ఆధారిత ఆన్‌లైన్‌ చెల్లింపులకు బదులు నగదు ఇవ్వాలంటూ వినియోగదారులే పోట్లాడుకుంటున్నారు. కొన్ని చోట్ల మద్యం షాపుల సిబ్బందితో క్యూలోని వారు వాగ్వాదానికి దిగడంతో ఏం చేయాలో పాలుపోక నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో నాలుగు నెలలుగా యూపీఐ ఆధారిత చెల్లింపులను అనుమతిస్తున్నారు.

తొలి విడత విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని పదకొండు మద్యం షాపుల్లో ఆన్‌లైన్‌ పేమెంట్లను ప్రయోగాత్మకంగా అమలు చేసి..ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 2,934 మద్యం షాపులు, మరో ఎనిమిది వందల వరకు ఉన్న ఎలైట్‌ (వాక్‌ ఇన్‌ స్టోర్స్‌), పర్యాటక ప్రాంతాల్లోని మద్యం షాపుల్లో ఆన్‌లైన్‌ పేమెంట్లను అనుమతిస్తున్నారు. మద్యం షాపుల్లో యూపీఐ ఆధారిత ఆన్‌లైన్‌ పేమెంట్ల కంటే నగదు చెల్లింపులకే వినియోగదారులు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపులు జాప్యం జరగమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు.

విపక్ష పార్టీల విమర్శలతో.. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో నగదు చెల్లింపులకే అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని రకాల మద్యం షాపుల్లో నగదు చెల్లింపులపై విపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రోడ్డుపై చిరు వ్యాపారులు సైతం ఆన్‌లైన్‌ పేమెంట్లను అనుమతిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో అనుమతించకపోవడమేంటని? పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టారు. పైగా బార్లలో ఆన్‌లైన్‌ పేమెంట్లను అనుమతిస్తుంటే..షాపుల్లో ఎందుకు అనుమతించరని పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. మద్యం అమ్మకం నగదు దారి మళ్లించేందుకే అనుమతించడం లేదంటూ విమర్శల దాడి పెంచడంతో ఏపీబీసీఎల్‌ అధికారులు పలుమార్లు ప్రయత్నాలు చేశారు. మద్యం షాపుల్లో ఆన్‌లైన్‌ పేమెంట్ల వలన తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. రాను రాను విమర్శలు పెరగడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల మద్యం షాపుల్లో ఆన్‌లైన్‌ పేమెంట్లను అనుమతిస్తున్నారు.

- Advertisement -

తలెత్తుతున్న ఘర్షణలు..
ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో జాప్యం చేసుకోవడంపై పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల మద్యం కోసం క్యూలో నిలబడిన వారు ఒకరిపై ఒకరు చేయి చేసుకునే పరిస్థితులు తలెత్తుతుంటే సిబ్బంది జోక్యం చేసుకొని సర్థుబాటు చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో మద్యం కొనుగోలు చేసేవారు సామాన్య, మధ్య తరగతి వర్గాలే. బార్లలో మద్యం రేట్లు అధికంగా ఉండటం కూడా ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మద్యం షాపుల్లో రూ.150(180ఎంఎల్‌) దొరికే సాధారణ బ్రాండ్‌ నిబ్‌ బార్లలో రూ.220 అమ్ముతున్నారు. సాధారణ మద్యం నుంచి ప్రీమియం బ్రాండ్‌ మద్యం వరకు ఒక్కొక్క నిబ్‌పై రూ.70 నుంచి రూ.100 వరకు అదనంగా ఉంటుందని వినియోగదారులు చెపుతున్నారు.

దినసరి కూలీలు, చిరు వ్యాపారులు అంత మొత్తం వెచ్చించి బార్లలో మద్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. పైగా ఆ మొత్తానికి మరికొంత నగదు జోడిస్తే ఇంకో క్వార్టర్‌(నిబ్‌) వస్తుందని చెపుతున్నారు. బార్ల రేట్లతో పోల్చుకొని మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి మద్యం వినియోగదారులు ప్రభుత్వ షాపుల్లో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున క్యూలు ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ చెల్లింపులతో తమకు ఆలస్యం అవుతుందంటూ క్యూలో ఉన్నవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క సారి మాటామాటా పెరిగి చిన్నపాటి దాడులకు సైతం వెనుకాడటం లేదు. మద్యం షాపు ఉద్యోగులు సర్థి చెప్పి పంపుతున్నా..తరుచూ ఇదో సాధారణ వ్యవహారంగా మారింది. కొందరు షాపు సిబ్బందితో వాగ్వాదానికి సైతం దిగుతున్నా..ప్రభుత్వ ఆదేశాలను పాటించక తప్పదంటూ వారు సర్థి చెప్పుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement