Tuesday, November 26, 2024

విశాఖ ఎన్‌ఐఓ లేబొరేటరీ నిర్మాణంలో జాప్యం.. ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలోని రిషికొండలో ఏర్పాటు చేయదలచిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) లేబరేటరీ నిర్మాణంలో అసాధారణ జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనని సైన్స్‌, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అంగీకరించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ జాప్యానికి కారణాలను వివరించారు. ఎన్‌ఐఓ లేబరేటరీ నిర్మాణానికి కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ అనుమతి సాధించడంలో జాప్యం జరిగిందని చెప్పారు. అలాగే స్కీమ్‌లకు తుది రూపం ఇవ్వడంలో, ఇతర పాలనాపరమైన అనుమతులు పొందడంలో జాప్యం జరిగినట్లు తెలిపారు. లేబరేటరీ భవన నిర్మాణానికి సంబంధించిన భవనాల ఆకృతులను రూపొందించేందుకు భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) సంస్థను ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌(పీఎంసీ)గా ఎంపిక చేసి 2009లో పనిని అప్పగించడం జరిగింది. పీఎంసీ 30 కోట్ల రూపాయల ప్రాధమిక అంచనా వ్యయంతో లేబరేటరీకి సంబంధించిన భవనాల డ్రాయింగ్‌లను సమర్పించింది. కాంట్రాక్ట్‌ బాధ్యతల ప్రకారం ఎన్‌ఐవో క్యాంపస్‌కు సంబంధించి ప్లానింగ్‌, డిజైనింగ్‌, ఎగ్జిక్యూషన్‌ పనులను పీఎంసీనే చేపట్టాలి. కానీ ఒప్పందంలోని బాధ్యతలను అది నేరవేర్చనందున ఎన్‌ఐఓ క్యాంపస్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. అందువల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించిన పీఎంసీ కాంట్రాక్ట్‌ను రద్దు చేయడానికి ఉభయుల మధ్య అంగీకారం కుదిరిందని మంత్రి తెలిపారు. ఈ ఒప్పందం రద్దైన వెంటనే ప్రభుత్వం కొత్త పీఎంసీ కోసం టెండర్‌ను పిలుస్తుంది. కొత్త పీఎంసీకి పనులు అప్పగించిన తర్వాత ఆరు మాసాల్లో పాలనాపరమైన, ఆర్థిక అనుమతులు పొందగలమని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. క్యాంపస్‌, భవనాల నిర్మాణం ప్రారంభమైన తర్వాత 18 మాసాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు.

పీఎం-ఎస్‌వైఎం కింద ఏపీలో లక్షా 50 వేల మంది నమోదు

ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌ (పీఎం-ఎస్‌వైఎం) పెన్షన్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 151882 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్యంలో భద్రత కల్పించేందుకు ప్రారంభించిన ఈ పథకం కింద 60 ఏళ్ళు పైబడిన కార్మికులకు ప్రభుత్వం నెలకు 3 వేల రూపాయలు పెన్షన్‌గా చెల్లిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం సహకారంతో ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్‌ కారణంగా ఈ పథకం ప్రయోజనాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లలేక పోయామని చెప్పారు. దేశంలో 18-40 ఏళ్ళ మధ్య ఉన్న 5.24 కోట్ల ఈ-శ్రమ కార్డు కలిగినవారందరినీ ఈ పథకంలో నమోదు చేసుకోవలసిందిగా ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement