Friday, November 22, 2024

పెద్దపులులకు రక్షణ కరువు

మహానంది : నల్లమలలో పెద్దపులికి రక్షణ కరువైంది. పెద్దపులి అనువైన ప్రదేశం కోసం ఎంతదూరమైనా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో పెద్ద పులులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. పెద్దపులి రాజసం ఇతర ఏ జంతువుకు రాదు. వేటగాళ్ల బారి నుంచి కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. అడవిలోని రైల్వే ట్రాక్‌ దాటుతూ పెద్దపులులు రైలు ఢీకొని ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇలాంటి ఘటనలు నల్లమల అడవి ప్రాంతంలోని చలమ రేంజ్‌ పరిధిలో తరచుగా చోటుచేసుకుంటున్నాయి. నల్లమల అడవిలో బస్సాపురం, బస్సాపురం బీట్‌, చలమ, దొంగబాయి ప లు ప్రాంతాలలో రైల్వేట్రాక్‌ మలుపులుగా ఉంటుంది. ఇక్కడ వన్యప్రాణులు రైల్వేట్రాక్‌పై నడుస్తూ ఇతర ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో సడన్‌గా రైలు రావడం.. రాత్రిళ్లు రైలు లైట్లు జంతువుల కళ్లలో పడటంతో ఎటూ పాలుపోక అక్కడే అగిపోతుండటంతో రైలు వేగంగా వచ్చి ఢీకొంటున్నాయి. వన్యప్రాణాలు నల్లమల అడవిలో అధికంగా ఉన్నాయి. జిల్లాస్థాయి అధికారులు గతంలో పెద్దపులి రైలు కిందపడి మృతిచెందినప్పుుడు వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకునేందుకు రైల్వే అధికారులకు నివేదికలు పంపామని చెబుతున్నారు. అయితే అధికారులు పంపే నివేదికలు కాగితాలకే పరిమితం కావడం, అమలుకు నోచుకోకపోవడంతో వన్యప్రాణుల రక్షణ గాలిలో దీపంలా తయారైంది.

మహానంది మండల పరిధిలోని నల్లమల అడవిలో చలమ రైల్వేస్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి రైలు పట్టాలు దాటే క్రమంలో రైలుఢీకొని పెద్దపులి మృత్యువాత పడింది. దీంతో విషయం తెలుసుకున్న అటవీ అధికారులు టీఎఫ్‌ రామకృష్ణ, డీఎఫ్‌ఓ వినిత్‌కుమార్‌, సబ్‌డీఎఫ్‌ఓ మారుతి ప్రసాద్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన పెద్దపులి కళేబరాన్ని పరిశీలించారు. ఈక్రమంలో నల్లమల అడవి ప్రాంతంలో వన్యప్రాణులకు ప్రాణభయం వెంటాడుతోంది. గత 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సుమారు పదుల సంఖ్యలో వన్య ప్రాణులు రైలు ప్రమాదబారిన పడి మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో రెండు పెద్ద పులులు, మూడు చిరుతలు, రెండు ఎలుగుబంట్లు ఉన్నాయి. అయితే వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు మీనమేషాలు లెక్కించడం తప్ప వాటి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్న దాఖలాలు కనిపించడం లేదు. వన్యప్రాణుల సంరక్షణ కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది. ఇప్పటికైనా అధికారులు వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత తీసుకుంటే వన్యప్రాణులను కాపాడుకోవచ్చు. నలమలలో సుమారు 130 వరకు పెద్దపులులు ఉంటాయని అంచనా.


కాగా పత్రికా విలేకరులు చనిపోయిన పెద్దపులిని చూసేందుకు వెళ్లగా అటవీశాఖ అధికారులు అనుమతించ లేదు.. ఎలాంటి సమాచారం అందించలేదు.. ఫొటొలు తీసేందుకు సైతం అంగీకరించలేదు. దీంతో పెద్ద పులి గోర్లు, చర్మం తదితర అవయవాలు ఉన్నాయా లేవా అనే .. విషయాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రమాదకర సంఘటనలు జరిగినా అటవీ శాఖ అధికారులు వౖన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో అటవీశాఖ నిర్లక్ష్యం కనిపిస్తోంది… వారి రైల్వే ట్రాక్‌ మూల మలుపుల వద్ద ట్రాక్‌కు ఆనుకుని ఏదైనా రక్షణ వలయం ఏర్పాటు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement