Friday, November 22, 2024

లోప‌భూయిష్టంగా జిల్లాల విభ‌జ‌న : ప‌వ‌న్ క‌ళ్యాణ్

ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేశారని, ఈ విభజన లోపభూయిష్టంగా సాగిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు. జిల్లాల విభ‌జ‌న‌పై ఆయ‌న మాట్లాడుతూ… పాలకుల చిత్తానికి తోచినట్లు ముందుకెళ్లారని విమర్శించారు. పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం అంటూ.. ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాతో పోలవరం ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

ఎటపాక, కుక్కునూరు లాంటి మండలాల ప్రజలు.. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అంటే ఆ ప్రాంత గిరిజనులు జిల్లా కేంద్రంలో ఉన్న అధికారిని కలవాలంటే కనీసం 2 రోజుల సమయం పడుతుందన్నారు. ఈ తరహా విభజనతో ప్రజలకు ఏ విధంగా పాలన చేరువ చేస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాల ఏర్పాటు చేయడానికి ముందు, ముసాయిదా వచ్చిన తర్వాత కూడా రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని.. వినతులను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా కావాలన్న అక్కడి గిరిజనుల అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాయలసీమలోనూ మదనపల్లె, హిందూపురం, మార్కాపురం కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకపోవడం పద్ధతి కాదన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో లోపాలపై ప్రజలు చేసే ఆందోళనలకు జనసేన అండగా ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement