Friday, November 22, 2024

రాష్ట్రంలో తగ్గుతున్న ఆహార ధాన్యాల ఉత్పత్తులు.. తుపాన్లు, వర్షాల వల్ల తగ్గిన దిగుబడులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో 2022-23 ఏడాదిలో ఆహారధాన్యాల ఉత్పత్తి గ్రాఫ్‌ నేల చూపులు చూస్తోంది. ఖరీఫ్‌, రబీ కలుపుకొని 169.30 లక్షల టన్నుల దిగుబడులొస్తాని ఇటీ-వల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు వ్యవసాయ బడ్జెట్‌తో పాటు సాధారణ బడ్జెట్‌లోనూ, సామాజిక, ఆర్థిక సర్వేలో సైతం ఇవే అంకెలు పేర్కొన్నారు. ఆ గణాంకాలు పంట ఉత్పత్తులపై ప్రభుత్వ రెండవ ముందస్తు అంచనాలు. తాజాగా వెలువడిన మూడవ ముందస్తు అంచనాల్లో ఆహారధాన్యాల దిగుబడులు 166.53 లక్షల టన్నులకు తగ్గిపోయాయి. రెండవ అంచనాల కంటే 2.77 లక్షల టన్నులు కుదించారు. ఆహార పంటల్లో ప్రధానమైన వరి ధాన్యం దిగుబడి కూడా కిందికే చూపించారు.

రెండవ అంచనాల్లో ధాన్యం ఉత్పత్తి 133.65 లక్షల టన్నులు కాగా మూడవ అంచనాల్లో 129.04 లక్షల టన్నులకు పడిపోయింది. సాగు విస్తీర్ణం తగ్గుదల, తుపాన్లు, అకాల వర్షాలు, వరదల వలన దిగుబడులు తగ్గుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాతావరణ పరిస్థితులతో పాటు తెగుళ్ల వలన మిర్చి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, శనగ ఉత్పాదకత తగ్గింది. ఆ మేరకు రైతులు నష్టాలు చవిచూశారు.

రెండు, మూడు అంచనాల మధ్య ఏరియా, ఉత్పత్తి, ఉత్పాదకత నడుమ పెద్ద వ్యత్యాసం కనిపిస్తోంది. వరి సాగులో 72 వేల ఎకరాలు తగ్గగా, ఉత్పత్తి 4.61 లక్షల టన్నులు తగ్గింది. ఉత్పాదకత ఎకరాకు 52 కిలోలు తగ్గింది. పప్పుధాన్యాల ఏరియా 4.52 లక్షల ఎకరాలు తగ్గగా, ఉత్పత్తి 1.57 లక్షల టన్నులు తగ్గించారు. మొత్తం ఆహారధాన్యాల ఏరియా 5.17 లక్షల ఎకరాలు తగ్గింది. ఉత్పత్తి 2.77 లక్షల టన్నులకు కోత పడింది. వేరుశనగ సాగు 5 వేల ఎకరాలు పెరగ్గా, ఉత్పత్తి 27 వేల టన్నులు తగ్గింది. ఉత్పాదకత 19 కిలోలు తగ్గించారు. మొత్తం నూనెగింజల సాగు 60 వేలు పెరగ్గా, ఉత్పత్తి 3.76 లక్షల టన్నులు పెరిగింది. పత్తి ఏరియా 10 వేల ఎకరాలు పెరగ్గా, దిగుబడి 3.05 లక్షల బేళ్లు తగ్గింది. ఉత్పాదకత 30 కిలోలు తగ్గింది.

మిర్చి సాగు 8 వేల ఎకరాలు పెరగ్గా, ఉత్పత్తి 1.78 లక్షల టన్నులు తగ్గింది. ఉత్పాదకత ఎకరాకు 325 కిలోల మేర తగ్గింది. జనవరిలో వేసిన రెండవ అంచనాకు మార్చి నాల్గవ వారంలో వేసిన మూడవ అంచనాలకు మధ్య ఏరియా, ఉత్పత్తి, ఉత్పాదకత మధ్య పెద్ద తేడా వచ్చింది. జూన్‌ తర్వాత వేసే తుది అంచనాల్లో ఇంకా దిగుబడులు తగ్గుతాయని భావిస్తున్నారు. గతేడాది మూడవ అంచనాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 171.70 లక్షల టన్నులుగా అంచనా వేయగా, చివరికొచ్చేసరికి 154.85 లక్షల టన్నులకు పడిపోయింది. అలాగే వరి ధాన్యం ఉత్పత్తి 133.53 లక్షల టన్నులనగా చివరికొచ్చేసరికి 121.16 లక్షల టన్నులకు దిగజారింది. ఈ సారి ఖరీఫ్‌ నార్మల్‌లో నాలుగున్నర లక్షల ఎకరాల్లో ఆహార పంటలు సాగు కాలేదు. రబీలో పది లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఈదృష్ట్యా మూడవ అంచనాల్లో ఆహారధాన్యాల ఉత్పత్తి కంటే చివరాఖరుకొచ్చేసరికి బాగా తగ్గే సూచనలే కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement