Thursday, November 21, 2024

విశాఖపట్నం-భోగాపురం బీచ్ కారిడార్‌పై డీపీఆర్ ఆధారంగా నిర్ణయం.. జీవీఎల్ ప్రశ్నలకు గడ్కరీ సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నం-భోగాపురం బీచ్ కారిడార్ కోసం డీపీఆర్ సిద్ధమవుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విశాఖపట్నం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఏమైనా అందాయా అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం జవాబిచ్చారు. రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వద్ద ఉన్న జాతీయ రహదారి 16 నుంచి వైజాగ్ పోర్ట్ కంటైనర్ టెర్మినల్‌ను కలుపుతూ ప్రస్తుతమున్న బీచ్ రోడ్డును ఆరు లేన్ల ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించిందని ఆయన పేర్కొన్నారు. తమ ఆదేశాలకు ప్రకారం డీపీఆర్ సిద్ధమవుతోందని, దాని ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రమంత్రి లిఖితపూర్వకంగా బదులిచ్చారు.

గాజువాక కాలుష్య సమస్యకు పరిష్కారం దొరికేనా?
గాజువాక అసెంబ్లీ పరిధిలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలను తొలగించేందుకు స్టీల్ ప్లాంట్ ద్వారా గంగవరం పోర్ట్ నుంచి జాతీయ రహదారికి ప్రత్యామ్నాయ కనెక్టింగ్ రోడ్డును అందించే యోచన ఉందా అని ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు జాతీయ రహదారుల అథారిటీ ఇటీవలే ఈ అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిందని, డీపీఆర్ అధ్యయనం కోసం కన్సల్టెంట్‌ను మంజూరు చేశామని నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. అధ్యయన ఫలితాల ఆధారంగా దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని హైవేల అభివృద్ధికి నరేంద్రమోదీ ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేసిందని, ఏపీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు ప్రధానితో పాటు నితిన్ గడ్కరీకి జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement