అమరావతి, ఆంధ్రప్రభ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి కామన్ సింబల్ కేటాయింపుపై ఈనెల 10వ తేదీ లోగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.. తన పార్టీకి కామన్ సింబల్ కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కిలారి ఆనంద్ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఈసీ నిర్ణయంపై ఆరా తీశారు. ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్, న్యాయవాది శివదర్శన్ జోక్యం చేసుకుంటూ ఒకే గుర్తు కోసం నిర్దేశిత నమూనాలో నిబంధనల ప్రకారం దరఖాస్తును ఈసీకి సమర్పించాల్సి ఉంటుందన్నారు. అయితే కేఏ పాల్ సమర్పించిన దరఖాస్తు నిర్దిష్ట నమూనా ప్రకారం లేనందున తిరస్కరించామని తిరిగి నిర్దేశిత నమూనాలో తాజాగా సమర్పించిన దరఖాస్తు పరిశీలనలో ఉందన్నారు.
ఈ నెల 10వ తేదీలోపు నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేశారు. అది నిర్దేశిత నమూనా ప్రకారం పూర్తిచేసి ఉంటేనే శాసనసభ ఎన్నికల్లో కామన్ సింబల్ కేటాయించే వీలుంటుందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనందున కామన్ సింబల్ సాధ్యపడదని తేల్చిచెప్పారు. కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ తాను దాఖలు చేసిన దరఖాస్తుతో పాటు వినతిపత్రంపై ఏ నిర్ణయం తీసుకున్నదీ సమాచారం అందించ లేదన్నారు. వాదనలు విన్న ఉన్నత న్యాయ స్థానం తీర్పును రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.