ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన వారి మాటలను నమ్మి నిరుద్యోగులు లక్షలు పోగొట్టుకొని మోసపోతున్నారు. ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాల పేరుతో అనేక రకాల మోసాలు చేసే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా నంద్యాలలో చోటుచేసుకుంది.
తాజాగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కొంతంగికి టోకరా వేశాడు ఓ వ్యక్తి. ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి లక్షలు దండుకొని పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే…. ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ఎన్జిఓ కాలనీలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అందరికీ చెప్పాడు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగుల నుండి భారీగా డబ్బు తీసుకున్నాడు. ఉద్యోగాలు రాకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డిని నిరుద్యోగులు నిలదీశారు. దాంతో అతడు ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.