Tuesday, November 26, 2024

అధికారంలోకి వస్తే రైతులకు రుణవిముక్తి.. నవ సంకల్ప్‌ శివిర్‌లో కాంగ్రెస్ తీర్మానం

కడప, ప్రభ న్యూస్‌ బ్యూరో : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ రైతుకు రుణమాఫీ లేదా రుణవిముక్తి కల్పిస్తామని, అలాగే రైతు ఖాతాల్లో నెలనెలా రూ.6 వేలు జమ చేయడంతో పాటు రైతుకు ఆసరాగా ఉుండేందుకు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ తీర్మానించింది. కడప పట్టణంలో శని, ఆదివారాలలో జరిగిన రాష్ట్ర నవ సంకల్ప్‌ శివిర్‌లో కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగత ఎన్నికల నాటికి బలోపేతం చేసేందుకు మేథోమధనం జరిగింది. ఈ శివిర్‌లో చివరిరోజైన ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రంలో దురదృష్టవశాత్తు బీజెపీ పాలన రావడంతో రైతుల పరిస్థితి దుర్భరమైందని, గిట్టుబాటుధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పాలనలో రైతుల దుస్థితి దిగజారిగిందని పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతుల పాలిట గొడ్డలి పెట్టులా మారాయన్నారు. వ చ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు, రైతులకు మంచిపాలన అందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన నవ సంకల్ప్‌ శివిర్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ చేసిన తీర్మానాలను వెళ్ళడించారు.

తీర్మానాలు :

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ, సాగునీటి రంగాలకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాలని, అలాగే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని తీర్మానించారు. అలాగే ప్రతి మండల కేంద్రంలో కోల్డ్‌ స్టోరేజీ, గిడ్డంగి సౌకర్యాలతో మార్కెట్‌ యార్డులు, పుట్‌ పాత్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత విద్యుత్‌ పథకాన్ని కొనసాగించేందుకు తీర్మానం చేశారు. అలాగే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే తొలగిస్తామని జాతీయ రైతు ఉపశమన కమిషన్‌ ఏర్పాటు చేసి, రుణమాఫీ లేదా రుణవిముక్తి కల్పించేందుకు తీర్మానించారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, కనీస మద్దతు ధర చట్టబద్దత కల్పించేందుకు మూలధనం వ్యయం భూమిబాడిగను జోడించి దీనికి అదనంగా 50 శాతం పెంచుతూ కనీసం మద్దతు ధర నిర్ణయించేందుకు, పంటల బీమా పథకాన్ని రైతులకు అనుకూలంగా అమలు చేసేందుకు తీర్మానించారు. అలాగే జాతీయ రైతు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకునేందుకు, ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ పరికరాలను జిఎస్టీ నుంచి మినహాయించేందుకు ఎన్‌ఏవై పథకం ద్వారా సన్నా, చిన్నకారు రైతులకు , భూమిలేని పేదలకు నెలలో రూ.6 వేలు చొప్పున ఖాతాలో జమ చేసేందుకు , ధాన్యం కొనుగోలు చెల్లింపులు పదిరోజుల్లోనే చెల్లించేందుకు తీర్మానాలు చేశారు. రాష్ట్రంలో వున్న పెండింగ్‌ ప్రాజెక్టులైన తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలను నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు తీర్మానం చేశారు. వీ టితో పాటు సహాకార పరపతి సంఘాలకు సకాలంలో ఎన్నికలు జరిపేందుకు రైతులకు సకాలం లో మేలు రకపు విత్తనాలు సరఫరా చేసేందుకు, ఎరువుల ధరను తగ్గించేందుకు బిందు తుంపర సేద్యాన్ని సబ్సీడి ద్వారా అందించేందుకు , పంటరుణాలకు రూ.3లక్షల వరకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసేందుకు తీర్మానాలు చేశారు. విలేకరుల సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి మయప్పన్‌, పిసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి, జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement