చిత్తూరు, జనవరి 17 (చిత్తూరు బ్యూరో) : చిత్తూరు జిల్లా వేలూరు రోడ్డులో గంగాసాగరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ప్రమాదంలో మరో 15మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వేలూరు, చిలాపల్లి సిఎంసి ఆస్పత్రులకు, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారు ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారు ఉన్నారు.
మృతుల్లో ఇద్దరు తిరుపతి వాసులున్నారు. నలుగురని గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. తమిళనాడుకు చెందిన వెంకటేశ్వరస్వామి భక్తులు వైకుంఠం ద్వార దర్శనానికి వచ్చి, దర్శనం చేసుకొని, తిరిగి వెళ్తుండగా, ప్రమాదం వీరిని వెంబడించింది. చిత్తూరు వేలూరు రోడ్డులో గంగాసాగర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12గంటల దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి నుంచి తమిళనాడులోని మధురైకి వెళుతున్న శ్రీ రంగనాథన్ ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సును టిప్పర్ వెనుక నుంచి ఢీకొనడంతో బస్సు బోల్తా పడి, 20 అడుగుల పాటు జారుకుంటూ వెళ్లి రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఉన్న కరెంటు పోల్ లోకి చొచ్చుకొనిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద విషయం తెలియగానే చిత్తూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. జేసీబీతో బోల్తా పడిన బస్సును పక్కకు తొలగించి, మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్ధరాత్రి సంఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు.
క్షతగాత్రుల తరలింపు, వైద్య సేవల నిమిత్తం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. సంఘటన స్థలం నుండి అర్ధరాత్రి సమయంలో చిత్తూరు ప్రభుత్వాసుప్రతికి వచ్చి క్షతగాత్రులతో మాట్లాడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఆందోళన చెందవద్దని క్షతగాత్రులకు దైర్యం చెప్పారు. వైద్యులు వైద్య సేవల నిమిత్తం తగు సూచనలు జారీ చేసి తెల్లవారుజామున 3గంటల వరకు హాస్పిటల్ లో ఉండి స్వయంగా వైద్యసేవలను పర్యవేక్షించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
ప్రమాదంలో ఈరచాకులంకు చెందిన జీవ, తిరుపతి సప్తగిరి నగర్ కు చెందిన చందు (33), తిరుపతి ఎన్జీవో కాలనీకి చెందిన శ్రీధర్ వీరయ్య (21), మదురైకి చెందిన ప్రసాద్ (32) గా ఇప్పటివరకు గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. ఈ ప్రమాదంలో భాను ప్ర ప్రకాష్, చెన్నయ్య, సుబ్రహ్మణ్యం, శివాని, కార్తీక, తేనేశ్వరి, వివేక్ కుమార్, చరిత, శరవణ, రాజశేఖర్, మౌనిక, దిలీప్, హాసిని రెడ్డి , ఆనందరాజు గాయపడ్డారు. ఇందులో 6 మంది చీలాపల్లి సీఎంసీలో చికిత్స పొందుతున్నారు. మరో ఆరుగురు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, చరితను మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. మౌనికను వేలూరు సిఎంసికి తరలించారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంతాపం…
గంగాసాగరం వద్ద రోడ్డు ప్రమాద ఘటన బాధాకారమని, మృతుల కుటుంబాలకు మంత్రి రాంప్రసాద్ సంతాపం తెలిపారు. విషమ పరిస్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్య సాయంగా చిత్తూరు జిల్లా వైద్యాధికారులకు సూచనలు చేశారు. ప్రయాణికులు రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.