మాడుగుల, డిసెంబర్ 13 (ఆంధ్రప్రభ) : అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాటిపర్తి గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహంలో 9వ తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని ముర్ల సత్యవతి (13) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గత వారం రోజుల నుండి విద్యార్థిని వసతి గృహంలో కడుపు నొప్పితో బాధపడుతున్నా, ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, సకాలంలో వైద్య సేవలు విద్యార్థినికి అందక పోవడంతోనే విద్యార్థిని మృతి చెందిందని సత్యవతి తల్లిదండ్రులు గంటన్నదొర, సన్యాసమ్మ ఆరోపిస్తున్నారు.
శుక్రవారం ఉదయం విద్యార్థినిని మాడుగులలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో చోడవరంలో మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే విద్యార్థిని మృతిచెందింది. అల్లూరి జిల్లా పాడేరు మండలం అయినాడ పంచాయతీ చీమలపల్లి గ్రామానికి చెందిన ఎస్టీ నూకదొరకు చెందిన విద్యార్థిని మృతి పట్ల అయినాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ జీలుగుబోయిన ఈశ్వరరావు, ఆ గ్రామానికి చెందిన పలువురు వసతి గృహం వద్ద విద్యార్థిని మృతదేహంతో ఆందోళన నిర్వహించారు.
విద్యార్థిని మృతికి కారకులైన వార్డెన్, హెచ్‌ఎం, ఉపాధ్యాయులను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వసతి గృహంలో విద్యార్థినీలకు ఆరోగ్య రక్షణ లేదని, మెనూ కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. సంఘటనా స్థలానికి జిల్లా గిరిజన వసతి గృహాల అధికారిణి వై.నాగ శిరీష, మాడుగుల ఇన్‌ఛార్జ్ ఎస్సై బి.జోగారావు సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థిని మృతికి గల కారణాలపై ఆరా తీశారు.