Saturday, January 11, 2025

Big Story: తండాల్లో మృత్యుఘోష.. కిడ్నీ వ్యాధితో పిట్టల్లా రాలిపోతున్న గిరిపుత్రులు

గిరి’జనాన్ని’ నీటి కాలుష్యం చాంపేస్తోంది. ఎప్పుడు ఏ ఇంట్లో చావు కబురు వినాల్సి వస్తోందోననే భయంతో తండా వాసులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. గడిచిన మూడు నెలల్లో ఇరవై మంది కిడ్నీ వ్యాధితో మృత్యువాత పడ్డారు. కృష్ణాజిల్లా ఏ.కొండూరు మండల పరిధిలోని గిరిజన తండాల్లో కిడ్నీవ్యాధి కోరలు చాచి ప్రజల ప్రాణలు తీస్తోంది. ఈప్రాంతంలో నీటి నాణ్యత నాశిరకంగా ఉంది. సిలికాన్‌, ఫ్లోరైడ్‌ మోతాదులు అధికంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫ్లోరైడ్‌ సమస్యను గుర్తించిన 14 జనావాసాల్లో ప్రభుత్వం ఆర్వోప్లాంట్లను ఏర్పాటు చేసింది. డయాలసిస్‌ రోగులకు వైద్యసేవలు అందిస్తోంది. కృష్ణాజలాలు తమ ప్రాంతానికి వస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందన్నది ఆ ప్రాంతవాసుల మనగతం. మరో ఉద్దానంలా మారుతున్న ఏ.కొండూరు కిడ్నీవ్యాధులపై ‘ఆంధ్రప్రభ’ స్పెషల్‌ ఫోకస్‌

అమరావతి, ఆంధ్రప్రభ: గిరిజన తండాల్లో మృత్యుఘోష హోరెత్తుతోంది. కృష్ణాజిల్లా ఏ.కొండూరు మండలంలో సుమారు 50 వేల జనాభా ఉంది. 21 పంచాయితీల్లో 16 తండాలు ఉన్నాయి. గిరిజన హక్కుచట్టం ద్వారా సంక్రమించిన భూముల్లో వ్యవసాయం చేసుకొనే వారు కొందరైతే, కూలి పనులు చేసుకొని జీవనం సాగించే వారు మరికొందరు. గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మంచినీటి సమస్య ఉంది. నీటిలో ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉండటంతో కాళ్ళు వంకర్లు పోవడం, దంత సమస్యలు తదితర వ్యాధులతో ప్రజలు బాధపడ్డారు. 2018 నుంచి సమస్య ఉగ్రరూపం దాల్చింది. కిడ్నీ వ్యాధుల బారిన ప్రాంత ప్రజలు అధికంగా పడుతున్నారు. దీప్లానగర్‌, కేశియాతండా, మంత్రియా తండా, గొల్లమందల తండాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఏడాదికి వందమంది ఈవ్యాధిబారిన పడి మృతి చెందుతున్నట్లు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు, ప్రభుత్వ లెక్కలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. 2021–22 కాలంలో 3 మరణాలు సంభవించాయని, డయాలసిస్‌పై పదిమంది రోగులు ఉన్నారని, సంరక్షణ, చికిత్సపై 130 మంది రోగులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.

భయం..భయం
కిడ్నీవ్యాధి గ్రస్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో పాటు మరణాలు అధికమవుతున్నాయి. కృష్ణారావుపాలెం పంచాయతీ పరిధిలోని దీప్లానగర్‌ తండాలో ఏడాదిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది కిడ్నీ వ్యాధితో మరణించారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు మృత్యవాత పడ్డ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏడాది క్రితం కిడ్నీవ్యాధి బారిన పడ్డ బోడరాజు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. గతంలో తండాల్లో కిడ్నీవ్యాధి పరీక్షలు నిర్వహించగా రెండువేల మందికి పైగా 1.5 నుంచి 16.5 శాతం వరకు క్రియాటిన్‌ శాతం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. చైతన్యనగర్‌ తండాకు చెందిన రాంజీ నాయక్‌ వారానికి మూడు సార్లు డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. ఇందుకుగాను రూ.15 వేలు ఖర్చవుతోందని చెప్పాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఉన్న అరకొర భూముల్ని తెగనమ్మి వైద్యానికి దారబోస్తున్నారు. కూలిపనుల కోసం వలసవెళ్ళిన కొందరైతే తిరిగి స్వగ్రామాలకు రావాలంటే భయపడుతున్నారు. ఒకప్పుడు పాడిపంటలు, పశుపోషణతో కళకళలాడిన తండాలు ఇప్పుడు మంచానపడి మూలుగుతున్నాయి.

హడావుడి
ఏదైనా రాజకీయ పార్టీలు ఉద్యమించినప్పుడో లేదా పేపర్లో రాసినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తున్నారన్నది ఆ ప్రాంత ప్రజల ఆరోపణ. మరణాల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు గతనెల్లో జిల్లా వైద్యాధికారిణి ఎం.సుహాసిని నేతృత్వంలో వైద్యాధికారుల బృందం తండాల్లో మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహించారు. మండలంలో ఉన్న 9 వాటర్‌ ప్లాంట్లు సక్రమంగా పనిచేయడం లేద న్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. సమస్యను గుర్తిస్తున్న అధికారుల బృందం త్వరితగతిన పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదనే అభియోగాలు ఉన్నాయి.

ప్రభుత్వ చర్యలు ఇవీ
కిడ్నీవ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్‌ సెంటర్‌ను తిరువూరులో ఏర్పాటు చేశారు. తండాల్లో స్క్రీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామని, అవసరం మేరకు మందులు అందిస్తున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక రూ.10 వేలను పదిమంది రోగులకు అందిస్తున్నారు.

- Advertisement -

కృష్ణాజలాలకు నిధులు మంజూరు చేయాలి
ఏ కొండూరు మండలంలో తండాల్లో గిరిజనం వ్యాధి బారినపడి చనిపోతున్నారు. గిరిజనులు విద్య వైద్యం కు అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా అవుతున్నాయి. 2007 సంవత్సరం నుండి ఏ కొండూరు మండలంలో గిరిజనులు కిడ్నీ వ్యాధితో వందల సంఖ్యలో చనిపోతున్నారు. ప్లnోరైడ్‌ సమస్య వల్లే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. కృష్ణా జలాల సరఫరా కోసం 27 కోట్ల రూపాయలు మంజూరు చేయాలి. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని పౌష్టికాహారం అందించాలి. కిడ్నీ వ్యాధితో ఉన్న బాధితులకు ఐదు వేల రూపాయల పెన్షన్‌ మంజూరు చేయాలి. ఏ కొండూరు మండలంలో కిడ్నీ హాస్పిటల్‌ ఏర్పాటు- చేసి గిరిజనుల ప్రాణాలు కాపాడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement