Monday, November 18, 2024

AP | ఏళ్ల తరబడి పదోన్నతులు లేని డీసీటీవోలు.. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా ఖాళీలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో సీటీవో పదోన్నతులు ఎండమావిలా మారాయి. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా.. పదోన్నతుల ఫైలుకు మోక్షం లేక అనేక మంది డీసీటీవోలు నిరుత్సాహానికి లోనవుతున్నారు. పదోన్నతి పొందిన తర్వాత పదవీ విరమణ చేయాలనే వారి ఆశలకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్‌(ప్రధాన కార్యాలయం) కార్యాలయంలోని కొందరు మోకాలడ్డుతున్నారనే ఆవేదన వీరు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రపతి నిబంధనలు..సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పదోన్నతుల కోసం ఇద్దరు డీసీటీవో స్థాయి అధికారులు ఆడుతున్న డ్రామాలో తాము సమిధలుగా మారుతున్నామంటూ పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారులకు చేరువగా ఉండే ఉద్యోగులు కావడంతో అక్కడ వీరి మాటే చెల్లుబాటు అవుతోంది. చివరకు ఉన్నతాధికారులను ఏమార్చి కోర్టుకు లేఖలు రాయించే స్థాయి వీరికి ఉందని తెలుస్తోంది. సహకరిస్తే ఓకే..లేకుంటే ఎఫ్‌ఏసీ ద్వారా పదోన్నతులు అడ్డుకుంటామని వీరు క్షేత్రస్థాయి అధికారులకు ఖరాఖండిగా స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి..

రాష్ట్రంలో 50కి పైగా సీటీవో ఖాళీలు ఉన్నాయి. వీటిని డీసీటీవో స్థాయి అధికారుల పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంది. గత పద మూడేళ్లుగా అధికారులు ఆ ఊసే పట్టించుకోవడం లేదు. ప్రతి ఉద్యోగి జీవితంలో అవకాశం ఉన్నంత వరకు పదోన్నతులు పొంది పదవీ విరమణ చేయాలని కోరుకుంటారు. ఇతర శాఖల్లో లాగానే వాణిజ్య పన్నుల శాఖలో సైతం పలువురు డీసీటీవోలు పదోన్నతిని ఆశిస్తున్నారు. 1999లో రిక్రూటైన వీరిలో పలువురు పదవీ విరమణకు దగ్గరగా ఉన్నారు. పదోన్నతి పొంది పదవీ విరమణ పొందాలనేది వీరి ఆశ. ఇందుకు ఉన్నతస్థాయి అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో డీసీటీవో కేడర్‌లోనే ఇంటికి వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.

అసలేం జరిగింది..

ఉమ్మడి ఏపీలో 2001 వరకు వాణిజ్య పన్నుల శాఖ సహా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ప్రధాన కార్యాలయం(హెడ్‌ ఆఫీసు) ఉద్యోగులకు క్షేత్రస్థాయి కార్యాలయాల్లో 10శాతం పదోన్నతి ఇచ్చి భర్తీ చేసే అవకాశం ఉండేది. అప్పట్లో కొందరు ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదోన్నతుల్లో ప్రధాన కార్యాలయం ఉద్యోగులకు 10శాతం అవకాశం ఇవ్వడం వలన తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ క్షేత్రస్థాయి కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు కోర్టుకు నివేదించారు. వీరి వాదనలను సమర్థించిన సర్వోత్తమ న్యాయస్థానం ఈ తరహా పదోన్నతి భర్తీలు నిబంధనలకు విరుద్ధమంటూ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి కార్యాలయం ఉద్యోగాలు స్థానికతతో కూడుకున్నవని పేర్కొంటూ ప్రధాన కార్యాలయంలో పని చేసే వారికి అవకాశం ఇవ్వడం అంటే 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీం ఆదేశాల నేపధ్యంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఈ విధానం రద్దు చేసి ఆయా క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ఉద్యోగాలను అక్కడి ఉద్యోగులకు పదోన్నతి ఇస్తూ భర్తీ చేసేలా నిర్ణయం తీసుకుంది. ప్రధాన కార్యాలయాల్లోని ఉద్యోగుల ఒత్తిడి మేరకు ఇరువర్గాలతో అప్పటి ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. చర్చలు సఫలీకృతం కావడంతో మూడు శాతం ప్రధాన కార్యాలయం ఉద్యోగులకు పదోన్నతి ఇస్తూ భర్తీ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పుకు ముందున్న పరిస్థితి పునరుద్ధరణకు ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న కొందరు చక్రం తిప్పుతుండటంతో పదోన్నతులకు బ్రేక్‌ పడింది. గత పదమూడేళ్లుగా క్షేత్రస్థాయి అధికారులు పదోన్నతులు లేకుండానే పని చేస్తున్నారు.

పదోన్నతి కావాలా? అయితే సహకరించండి..

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించే ఇద్దరు ఉద్యోగులు 2001కి ముందున్న పరిస్థితి పునరుద్ధరణకు పట్టుబడుతున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తమకు సహకరిస్తేనే పదోన్నతులు వస్తాయని..లేకుంటే అలా ఏళ్ల తరబడి ఉండాల్సిందేనంటూ క్షేత్రస్థాయి ఉద్యోగులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. సుప్రీం తీర్పును సైతం గతంలో వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కమిషనర్‌గా డెప్యుటేషన్‌పై విధులు నిర్వహించిన అధికారికి చెప్పి ఆపగలిగినట్లు వీరు ప్రైవేటు సంభాషణల్లో ఉద్యోగుల వద్ద ప్రస్తావిస్తున్నారు.

సర్వీసు నిబంధనలు పక్కనబెట్టించి హైకోర్టు జీపీకి లేఖ రాయించడం ద్వారా సీటీవో పదోన్నతులను ఆపిన తమకు..ఇప్పుడు కూడా పెద్ద విషయమేమీ కాదని చెపుతున్నట్లు ఉద్యోగుల ఆవేదన. తాము చెప్పినట్లు వినని పక్షంలో నచ్చిన డీసీటీవోలకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) ఇప్పంచడం ద్వారా సమస్యను కొలిక్కి రాకుండా చూస్తామనే బెదిరింపుల నేపధ్యంలో పలువురు క్షేత్రస్థాయి అధికారులు ఉన్నతాధికారుల సహకారం కోసం ఎదురు చూస్తున్నారు. మరి వీరి ఆవేదనపై వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement