Tuesday, November 26, 2024

రోజులు మారాయి, పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్లు.. 10వేలకు పైగా వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌

అమరావతి, ఆంధ్రప్రభ: జబ్బు చేస్తే పట్నం పోయి దవాఖానాలో క్యూలో నిల్చొని చికిత్స పొందిన పల్లె ప్రజల ముంగిటకు వైద్యసేవల్ని ప్రభుత్వం తీసుకెళుతోంది. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2వేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని విలేజ్‌ క్లినిక్‌లను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో పది వేలకు పైగా వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ లు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ప్రతి 30 వేల జనాభా ఉన్న మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 2 ప్రై మరీ హెల్త్‌ సెంటర్లు నెలకొల్పుతున్నారు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు వైద్యులు ఉంటారు. ప్రతి వైద్యుడికి 104 వాహనాన్ని కేటాయించి ఒక్కో వైద్యుడికి మండలంలో 4-5 గ్రామాల చొప్పున కేటాయించారు. వీళ్లు రోజు విడిచి రోజు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించేలా యాక్షన్‌ప్లాన్‌ రూపొందించారు. ఆయా గ్రామాల్లో ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లుగా సేవలు అందిస్తున్నారు. తద్వారా ఆ గ్రామాల్లో ప్రజలను పేరు, పేరునా పలకరిస్తూ వారికి సేవలు అందించడంతో పాటు విలేజ్‌ క్లినిక్‌ను మెడికల్‌ హబ్‌గా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఏఎన్‌యమ్‌, నర్సింగ్‌ గ్రాడ్యుయేట్‌, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రాక్టీస్‌నర్‌, ఆశా వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్‌ అర్హతతో 7,112 మందికి మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రాక్టీషనర్‌ పోస్టుల్ని భర్తీ చేశారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో 12 రకాల వైద్యసేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 65 రకాల మందులు అందిస్తున్నారు.

మూస ధోరణికి చెక్‌..

ప్రభుత్వాసుపత్రుల్లో మూసధోరణికి చెక్‌పెట్టేలా చర్యలు చేపడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ వైద్యుల్లో జవాబుదారీ తనాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 20 ప్రసవాల జరిగేలా టార్గెట్‌లు విధించారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలకు ఆరోగ్యశ్రీ ఆసరా కింద తల్లులకు రూ.5 వేలు, రూ.3 వేలు చొప్పున ప్రోత్సహకాలు అందిస్తున్నారు. సంఖ్య మూస దోరణి కి చెక్‌ పెడుతున్నారు. వైఎస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు మొదలుకొని జిల్లా ఏరియా ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని ఈ నెలాఖరు నాటికి పదోన్నతులు, పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. 39 వేల పోస్టుల్ని భర్తీ చేయడంతో పాటు నాడు నేడు కింద ఆసుపత్రుల ఆధునీకరణకు రూ. 16వేల కోట్ల మేర బడ్జెట్‌ను కేటాయించారు.

విరివిగా నిధులు..ఉచితంగా భూములు..

రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలు ఉండగా.. మరో 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఒక క్రమపద్ధతిలో మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రుల నిర్మాణాలను చేపడుతున్నారు. దీని వల్ల హెల్త్‌ సెక్టార్‌లో మరింతమంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌ అందుబాటులోకి వస్తారన్నది ప్రభుత్వ అంచనా. అన్ని ప్రాంతాలకు బోధనాసుపత్రుల సేవలు సమానంగా అందించాలన్నదే లక్ష్యం. మెడికల్‌ కాలేజీల ఏర్పాటు చేసినప్పుడే… పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌ వస్తారు. అప్పుడే ఆ మెడికల్‌ కాలేజీలను అనుసంధానం చేయడం ద్వారా అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులో వస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. వైద్య, ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయాలంటే అవైలబులిటీ, యాక్సెస్‌బులిటీ, ఎఫర్ట్‌బులిటీ ఈ మూడు సమాంతరంగా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో16 కొత్త మెడికల్‌ కాలేజీలతోపాటు- మరో 16 మల్టీస్పెషాలిటీ- హెల్త్‌ హబ్‌లకు ప్రభుత్వం ఉచితంగా భూమిని కేటాయిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement