నెల్లూరు జిల్లాలో అభిమాన తరంగం
చింతరెడ్డి పాలెం నుంచి తొమ్మిదో రోజు బస్సుయాత్ర షురూ
బస్సు వెంటే తండోపతండాలుగా ప్రజానీకం
మహిళలు, వృద్ధులకు సీఎం పరామర్శ
నీ వెంటే మేమంతా అంటూ జనం నీరాజనం
అనారోగ్య పీడితుడికి భరోసా
ఆంధ్రప్రభ, నెల్లూరు బ్యూరో : ఏపీలో 175కి 175 స్ధానాలను గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేమంతా సిద్ధం పేరిట చేపట్టన బస్సుయాత్ర నెల్లూరు జిల్లాలో … సీఎం జగన్ జైత్రయాత్రలా సాగుతోంది. చింతరెడ్డిపాలెం నైట్ స్టే పాయింట్ నుంచి శనివారం ఉదయం సీఎం జగన్ యాత్ర ప్రారంభమైంది. అంతక ముందు నెల్లూరు జిల్లా ఎనిమిది అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్ధానంలో గెలవాలన్న లక్ష్యంతో నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెం స్టే పాయింట్ వద్ద 8 బై 8 టీషర్ట్ మీద సీఎం వైఎస్.జగన్ వైఎస్‌ఆర్‌సీపీ స్టాంప్‌ను వేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్‌ను నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్.జగన్ దిశా నిర్దేశం చేశారు. భగత్‌సింగ్ కాలనీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్ బస్సుయాత్ర జాతీయరహదారిపైకి చేరుకోగా భారీ సంఖ్యలో మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ బస్సు యాత్ర కోవూరు నియోజకవర్గం పడుగుపాడు చేరుకోగ, మేమంతా సిద్ధం అంటూ జాతీయరహదారిపై తండోపతండాలుగా జనం తరలివచ్చారు.
గుమ్మడికాయలతో దిష్టితీసి సీఎం వైఎస్.జగన్‌కి స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లాలో ఊరూరా జనం తరలి వచ్చి జగన్ మాటల కోసం ఎదురు చూశారు. చిరునవ్వులతో జనాన్ని పలకరిస్తూ.. పరామర్శిస్తూ జగన్ బస్సుయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి , వైసీపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
చలించిన సీఎం
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కుమ్మరకొండూరుకు చెందిన 20 ఏళ్ల దర్శిగుంట జయకృష్ణ 15 ఏళ్లుగా ఎదుగుదల లేక, నడక రాక అంతుపట్టని వ్యాధితో మంచానికే పరిమితం అయ్యాడు. తల్లి రాణమ్మ ఇంత వరకూ లక్షలు ఖర్చు చేసినా, ఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోయింది. భర్తను కూడా పోగొట్టుకుని, కొడుకు వైద్యం కోసం ఇక ఖర్చు చేయలేని పరిస్థితిలో … ఆర్థిక సాయం కోసం సీఎం వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేసింది. జయకృష్ణ పరిస్థితి చూసి చలించిన సీఎం ఆమెకు భరోసా కల్పించారు. జయకృష్ణ చికిత్సకు అవసరమైన సాయం అందించాలని ఆరోగ్యశ్రీ అధికారులను ఆదేశించారు.