Thursday, January 23, 2025

Davos to Delhi | రేపు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ !

దావోస్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నాలుగు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో చర్చలు జరుపుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేశారు. కాగా, దావోస్ పర్యటన అనంతరం సీఎం బృందం ఈరోజు అర్ధరాత్రి తర్వాత ఢిల్లీ చేరుకోనుంది.

చంద్రబాబు నేరుగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి 1 జన్‌పథ్‌లోని తన అధికారిక నివాసానికి వెళ్లనున్నారు. ఈ క్ర‌మంలో రేపు (జనవరి 24) ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు.

కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి నిధుల కేటాయింపు అంశంపై ఢిల్లీ పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఆ త‌ర్వాత‌ మధ్యాహ్నం 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్‌, ప్రహ్లాద్‌ జోషిలతో సమావేశం కానున్నారు.

ఏపీకి గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు. దావోస్‌లో వివిధ కంపెనీల ప్రతినిధులు, అధిపతులతో జరిపిన చర్చలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఆయా శాఖల మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.

ఏపీకి పరిశ్రమలు తీసుకురావడానికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నాం అనే అంశంపై కూడా చంద్రబాబు కేంద్ర మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంది. కేంద్ర మంత్రుల‌తో భేటీ అనంత‌రం రేపు సాయంత్రం చంద్రబాబు విజయవాడ వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement