Thursday, January 23, 2025

Davos – ఏపీలో ఐటీ అభివృద్ధికి సహకారం అందించండి – బిల్ గేట్స్ తో చంద్రబాబు

దావోస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిను చాలా కాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తెలిపారు.. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది.

ఈ సదస్సులో మైక్రో సాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు, ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా బిల్స్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారి పోయిన విషయాన్ని ఈ సందర్భంగా బిల్ గేట్స్‌కు గుర్తు చేశారు. అలాగే దక్షిణ భారతదేశంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గేట్‌వేగా నిలపాలని కోరారు.

- Advertisement -

ఇక శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని బిల్స్ గేట్స్‌కు చంద్రబాబు విజ్జప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న ప్రపంచ స్థాయి ఎఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని ఆయనను కోరారు. మీ అమూల్యమైన సలహాలు తమ రాష్ట్రంలో ఐటి అభివృద్ధికి దోహదం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండంటూ బిల్స్ గేట్స్‌ను సీఎం కోరారు.

రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకో సిస్టమ్‌ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్‌ బోర్డ్‌ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని సైతం అందించాలంటూ బిల్స్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు కోరారు. మీ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని బిల్ గేట్స్‌కు చంద్రబాబు హామీ ఇచ్చారు

ఈ సమావేశమనంతరం బిల్స్ గేట్స్‌ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తన సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement