Thursday, January 23, 2025

Davos – ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు – ఎంతో సంతోషంగా ఉందన్న రేవంత్

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు వేదికగా తెలంగాణ , ఎపి , మహారాష్ట్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు , దేవేంద్ర ఫడ్నవీస్ కీలక భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

రేవంత్, చంద్రబాబు, ఫడ్నవీస్ భేటీవరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్ లో జరిగిన “కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్” రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ఒకే వేదిక పంచుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలు ప్రశ్నలపై మాట్లాడారు. ‘పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో వేదికను పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము సరిహద్దులతో పాటు నదులు, కృష్ణా, గోదావరి నీటిని కూడా పంచుకుంటున్నాం. ఈ నదులు మహారాష్ట్ర నుంచి ప్రారంభమై, తెలంగాణలోకి ప్రవేశించి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తాయి. అందువల్ల, మేం అభివృద్ధి సాధించడమే మా మొదటి ప్రాధాన్యత’ అని రేవంత్ రెడ్డి వివరించారు.

ఆ సిటీల స్థాయికి హైదరాబాద్

న్యూయార్క్, టోక్యో లాంటి నగరాల స్థాయికి హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడుతుంది. అభివృద్ధి బాటలో నడవడానికి తెలంగాణ పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలను కొనసాగిస్తుంది. కంప్యూటర్స్, టెలికాం రంగాల్లో రాజీవ్ గాంధీ ప్రారంభించిన సంస్కరణలు, ఆ తర్వాత పీవీ నరసింహరావు సరళీకృత ఆర్థిక విధానాలతో ప్రపంచ దేశాలతో పోటీ పడే మార్గాన్ని చూపించారు. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తీరు అసాధారణం అని రేవంత్ రెడ్డి కొనియాడారు.

ఇప్పుడు, తెలంగాణ ప్రపంచ స్థాయి నగరాలతో, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో పోటీపడుతోంది. దేశీయ రాష్ట్రాలతో పోటీ పడటం కాకుండా చైనా ప్లస్ వన్ కంట్రీకి తెలంగాణ గమ్యస్థానంగా ఉంటుంది. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న భారత ప్రధానమంత్రి లక్ష్యసాధనలో తెలంగాణ భాగస్వామ్యమవుతుంది. 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకుపోతోందని సీఎం రేవంత్ అన్నారు.

మూడు ప్రాంతాలుగా తెలంగాణ అభివృద్ధి

తెలంగాణ మూడు ప్రాంతాలుగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా నిర్ధేశించాం. ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ ప్రాంతంలో ఐటీ, ఫార్మా రంగాలున్నాయి. రెండో భాగం ఓఆర్ఆర్ నుంచి 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే 65 శాతం తెలంగాణ నగర ప్రాంతంగా మారుతుంది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పట్టణీకరణ ఒక పరిష్కారంగా భావిస్తాను. ఇక మూడవ భాగం.. తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీ, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, మాంసం, కోళ్లు చేపల ఎగుమతి పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ వివరించారు.

దావోస్ పర్యటనతో ఏం తెలిసిందంటే?

దావోస్ పర్యటన ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో, ప్రపంచం ఎలా పురోగమిస్తుందో తెలుసుకోవడానికి ఉపయోగపడింది. అదే సమయంలో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించాలని అనుకుంటున్నాం. మా అత్యంత పెద్ద బలం హైదరాబాద్, యువత. మా ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉంటాయి. మాపై నమ్మకం ఉంచండి. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. కానీ అభివృద్ధి విషయంలో మా విధానాలు సుస్థిరంగా ఉంటాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి’ అని వేదిక నుంచి రేవంత్ పారిశ్రామిక వేత్తలను కోరారు.

ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సమీర్ శరణ్ సంధానకర్తగా వ్యవహరించారు. భారతదేశం-రాష్ట్రాల అభివృద్ధి దృక్పథం సంక్షేమం, సాంకేతికత, ఉద్యోగాల కల్పన – భవిష్యత్తు.. వంటి పలు అంశాలపై ముగ్గురు ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement