Wednesday, October 9, 2024

Date Extended – ఏపీలో మద్యం టెండర్లకు గడువు పెంపు..

11 వరకు దరఖాస్తులు స్వీకరణ
15 న దుకాణాలకు లాటరీ డ్రా..
గడువు పెంపుతో పెరగనున్న పోటీ..
సిండికేట్ వ్యూహానికి కొంత బ్రేక్..
గడువు పెంపుతో పెరగనున్న ఆదాయం..

భీమవరం ప్రభ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మద్యం దుకాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ గడువును 11 వరకు పెంచింది. ఈనెల2న మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించి ఈనెల 9 న అంటే నేటితో ముగించాలని నిర్ణయించారు. ఈనెల 11న మద్యం షాపులకు సంబంధించి డ్రా తీయాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం గడువును పెంచుతూ ఉత్తర్వులు బుధవారం జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఈనెల 11 వరకు స్వీకరించనున్నారు. ఈనెల 15న మద్యం దుకాణాల లాటరీని అధికారుల సమక్షంలో తీయనున్నారు. తాజా నిర్ణయంతో మద్యం దుకాణాలకు దరఖాస్తుకు మరో రెండు రోజులు పెరగడంతో పోటీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వానికి కూడా దరఖాస్తుల రూపంలో మరింత ఆదాయం సమకూరనుంది.

ఏపీ 3396 దుకాణాలు..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 3396 మద్యం దుకాణాలు ఉన్నాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 దుకాణాలు ఏర్పాటుకానున్నాయి. నెల్లూరులో 182, పశ్చిమగోదావరి జిల్లాలో 175, ప్రకాశంలో 171 దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40, మన్యం జిల్లాలో 52 దుకాణాలు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఈ దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులను కోరగా మంగళవారం సాయంత్రానికి 39,259 దరఖాస్తులు అందాయి. గడువు పెంపుతో ఆయా దుకాణాలకు మరింత దరఖాస్తులు రావడంతో పాటు దరఖాస్తు రుసుం కింద వచ్చే ఆదాయం కూడా భారీగా పెరుగుతుందని కోణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆన్లైన్ లో సాంకేతిక సమస్యలు, పండగ సెలవులు కారణంతో కొంతమంది దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి వారందరికీ పింఛను గడువు ఓ వరంలా లభించునుంది.

సిండికేట్ వ్యూహానికి కొంత బ్రేక్..

రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు టెండర్ల విషయంలో సిండికేట్ వ్యూహాలు అమలు చేశారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాజకీయ నాయకుల అండదండలు, అనుచరుల బెదిరింపులు కారణంగా ప్రభుత్వానికి దరఖాస్తుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడిందని అనుమానాలు ఉన్నాయి. సిండికేట్ వ్యూహాలకు ప్రభుత్వం పెంచిన గడువు కొంత బ్రేక్ వేసేలా కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో కొంతమంది నాయకులు ప్రత్యర్థి పార్టీల నాయకులతో కలిసి సిండికేట్ వ్యూహం అమలు చేస్తున్నారు.

ప్రత్యర్థ పార్టీ నాయకులతో కలిసి దరఖాస్తు చేసుకున్న వారికి బెదిరింపులు పంపడం, వారిని ఒత్తిళ్లకు గురి చేయటం వంటి అంశాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. ఇటువంటి సంఘటన వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉండడంతో వీరిని కట్టడి చేయటానికి కూడా ఈ గడువు పెంపు ఒక్క కారణంలా కనిపిస్తుంది. ఇప్పటివరకు రాజకీయ ఒత్తిళ్లతో కొంతమంది వెనక్కి తగ్గిన పెంచిన గడువుతో వారిలో కొత్త ఆశలు రేపుతున్నాయి. ఏదోలా మద్యం దుకాణాలకు పోటీపడాలని ఒత్తిళ్లు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ఐక్యమవుతున్నారు. ఈ కీలక ప్రాంతాల్లో ఆదాయం భారీగా సమకూరే అవకాశం ఉండటంతో ఇక్కడ ఒక్కో దుకాణానికి కనీసం 40 దరఖాస్తులైనా రావాలి. కానీ ఇటువంటి కీలక ప్రాంతాల్లో సైతం సిండికేట్ వ్యూహాల కారణంగా పోటీ పెద్దగా కనిపించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement