Friday, November 22, 2024

డేంజరస్​ యాక్సిడెంట్స్​, ఏడో స్థానంలో ఏపీ.. ఐదేళ్లలో 39 వేల మంది దుర్మరణం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరు, సంభవిస్తున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రమాదాలు నిత్యకృత్యంగా మారడంతో మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల నివేదికల ప్రకారం రోడ్డు ప్రమాదాలు, మరణాలలో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన ఐదేళ్లలో పెద్దఎత్తున మరణాలు రోడ్డు ప్రమాదాల్లో సంభవించాయి. 2016 నుంచి 2020కి మధ్య జరిగిన ప్రమాదాల వివరాలను కేంద్ర రహదారులు, రవాణాశాఖ తాజాగా వెల్లడించింది. ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 16 వేల 591 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూ 39 వేల 180 మంది మృత్యువాత పడ్డారు. అంటే సగటున ఏడాదికి 8 వేల మరణాలు సంభవించినట్లుగా స్పష్టమవుతోంది. ఈ ప్రమాదాలన్నీ కూడా అతివేగంతోనే దాదాపు సంభవించినట్లు కేంద్ర అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క 2020 సంవత్సరంలోనే రాష్ట్రంలో 19 వేల 509 ప్రమాదాలు సంభవించగా వీటిలో 7 వేల మందికిపైగా మృతి చెందారు. ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 16 వేలకు మందికి పైగా అంగ వైకల్యానికి గురయ్యారు. ఒక్క ఏడాదిలోనే సంభవించిన ప్రమాదాలను గమనిస్తూ అతివేగం కారణంగా 5 వేల 230 మంది బలైపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 11.34 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే సంభవించాయంటే రోడ్డు భద్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ రెండేళ్లలో కూడా ప్రమాదాలు రాష్ట్రంలో ఎక్కువగానే నమోదయ్యాయి. 2021 – 22లో దాదాపు 16 వేల మందికి పైగా రాష్ట్రంలో మృత్యువాత పడ్డట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు నమోదైన ప్రమాదాలను పరిశీలిస్తే రాష్ట్ర రహదారుల్లో జరిగిన ప్రమాదాల కన్నా జాతీయ రహదారుల్లో జరిగినవి అత్యధికంగా ఉన్నాయి. ఈ రెండేళ్లలో 31 వేలకు పైగా ప్రమాదాలు జరిగినట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఇదే సమయంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రమాదాలు కాస్త తగ్గడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. మద్యం సేవించి వాహనాలు నడపడంతో జరిగే ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2019 నుంచి 2020 వరకు జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే దాదాపు 205 ప్రమాదాలు సంభవిస్తే, 160 మంది మృత్యువాత పడ్డారు. మద్యం మత్తులో జరిగిన ప్రమాదాల అంశంలో రాష్ట్రం 13వ స్థానంలో ఉన్నట్లుగా కేంద్ర నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం వెల్లడించిన గణాంకాల్లో విజయవాడ, హైదరాబాద్‌ జాతీయ రహదారిలోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నట్లుగా వెల్లడైంది. ప్రతి ఏడాది ఈ జాతీయ రహదారిపైనే దాదాపు 700 నుంచి 800 వరకు ప్రమాదాలు సగటున జరుగుతున్నట్లు నివేదికల్లో తేలింది.

ప్రమాదాల నివారణకు జాయింట్‌ యాక్షన్‌..

రాష్ట్రంలో ప్రమాదాలను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని పెట్టాయి. ఆందోళన కలిగించే రీతిలో జరుగుతున్న ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాయి. అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిని నివారించేందుకు పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టాయి. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి రోడ్డుభద్రతకు అవసరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ప్రమాదాలకు నెలవుగా మారిన రోడ్లలో మార్పులు చేసేందుకు ప్రత్యేక నిధులను మంజూరు చేయనుంది. ఏడాదికి రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్లను రహదారులలో భద్రతా చర్యలు చేపట్టేందుకు మంజూరు చేయనుంది. అలాగే రాష్ట్రప్రభుత్వం కూడా తన వాటాగా మరో రూ. 150 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిధులతో రోడ్ల నిర్మాణంలో మార్పులతో పాటు ప్రమాదాలు అత్యధికంగా చోటుచేసుకుంటున్న ప్రాంతాల సమీపంలో ట్రామాకేర్‌ సెంటర్లు, ప్రతి వంద కిలోమీటర్ల లోపు జాతీయ రహదారుల్లో ఒక అం బులెన్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement