వేసవికి ముందే అడుగంటే ప్రమాదం
ప్రస్తుత నీటి మట్టం 130 టీఎంసీలే
గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలు
విద్యుత్ ఉత్పత్తి పెంచిన ఇరు రాష్ట్రాలు
యాసంగి పంటలకు సాగునీరు ఎట్లా?
ఆందోళనలో ఆయకట్టుదారులు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ :
శ్రీశైలం ప్రాజెక్టు నిల్వలు భారీగా పడిపోయాయి. దీంతో ఆయకట్టుదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. గురువారం నాటికి అధికారులు వెల్లడించిన ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులో 130 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో గరిష్ఠ నీటి నిల్వ 215 టీఎంసీలు. సుమారు 95 టీఎంసీలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణ యాసంగి పంటలకు సాగు నీరు అందుతుందో లేదో అని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలు బాగా కురిశాయి.. కానీ
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు నెల రోజుల ముందుగానే ప్రాజెక్టు నిండింది. దాదాపు రెండు నెలల పాటు విస్తారంగా వర్షాలు కురవడంతో వరద నీరు నాగార్జున సాగర్ ద్వారా కృష్ణ నదిలోకి విడిచిపెట్టారు. అలాగే కృష్ణ నదికి భారీ వరదలు కూడా వచ్చాయి. శ్రీశైలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరు కంటే ఎక్కువ సార్లు గేట్లను ఎత్తి దిగువకు నీరు విడిచిపెట్టారు. నెల రోజుల క్రితం వరకు నిండు కుండలా ఉన్న శ్రీశైలం జలాశయం నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి.
విద్యుత్ ఉత్పత్తి పెంచి ఏపీ, తెలంగాణ
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు భారీగా ఉండడంతో ఆంధ్రా, తెలంగాణకు చెందిన జల విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి పెంచాయి. ఈ కారణంతోనే శ్రీశైలం నీటి నిల్వ దారుణంగా పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రతి రోజు విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగిస్తుండగా అవుట్ ఫ్లో 35,315 క్యూసెక్కులు ఉంటుంది. దీంతో శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 867.40 అడుగులకు చేరుకుంది. కుడి గట్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయగా, ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అయితే ఔట్ ఫ్లో ఇలానే కొనసాగితే మరో రెండు నెలల్లో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.