Thursday, November 21, 2024

Danger Bells – ఏపీ, తెలంగాణలో భానుడి భగభగ

45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
ఉదయం 9 దాటితే నిప్పుల కుంపటే
సాయంత్రం 7 దాటిన తగ్గని వేడి
వేడిగాలులకు జనం విలవిల
ఉక్కబోతకు ఉక్కిరిబిక్కరి
బయట కాలు పెట్టని జనం
అవసరమైతేనే బయటకు
నిర్మానుష్యంగా రోడ్లు
రెడ్ వార్నింగ్ ఇచ్చిన వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో రికార్డు అయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెండ్ వార్నింగ్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : మీరు ఇళ్ల నుంచి బయటికి వెళ్తున్నారా? బీ కేర్‌ఫుల్!. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయటపెట్టకండి. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెడ్ వార్నింగ్‌ ఇచ్చింది. మరో 3 రోజులపాటు ఎండలు మండిపోతున్నాయని హెచ్చరించింది ఐఎండీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడికి జనాలు ఒక్కరి బిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

- Advertisement -

8 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. శుక్రవారం దాదాపు 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. గత పదేళ్లలో ఏప్రిల్‌ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈస్థాయి ఎండలు చూడటం ఇదే తొలిసారి. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్‌, ములుగు, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్‌, వనపర్తి జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు రెడ్‌ వార్నింగ్‌ జారీ చేశారు. తెలంగాణలో మరో మూడు రోజులపాటు ఎండలు మండిపోనున్నాయి. వృద్దులు, పిల్లలు, వీధి వ్యాపారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. వీలయినంతవరకూ ఓర్ఎస్‌, చలువ చేసే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

ఏపీలోనూ మాడు పగులుతోంది..
ఏపీలోనూ భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఏపీలోని 8 జిల్లాలోని 61 మండలాల్లో వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది.

శ్రీకాకుళంలో తీవ్ర వడగాల్పులు

ఇక నిన్న ఏపీలోని నంద్యాలజిల్లా చాగలమర్రిలో 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతిజిల్లా రేణిగుంటలో 45.7, కడపజిల్లా ఖాజీపేట, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరులో 45.7, విజయనగరంజిల్లా గజపతినగరం, కర్నూలుజిల్లా కోడుమూరులో 44.8, అనంతపురంజిల్లా తాడిపత్రిలో 44.4, పల్నాడుజిల్లా మాచెర్లలో 44.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement