Tuesday, September 17, 2024

AP: జగన్ హయాంలో ఏశాఖలో చూసినా అవినీతే.. బుద్దా వెంకన్న

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : రాష్ట్రంలో ఏ శాఖనూ వదిలిపెట్టకుండా జగన్ ఆధ్వ‌ర్యంలోని దండుపాలెం బ్యాచ్ మొత్తం దోచుకుందని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ప్రస్తుతం వారు చేస్తున్న అరాచకాలు బయట పడుతున్నందునే ఎక్కడికక్కడ ఫైర్ల ద‌హ‌నానికి ఒడిగడుతున్నారని విమర్శించారు. జగన్ ను చూసి ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న ఆయన ప్రస్తుతం చంద్రబాబు ఉన్నందునే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయన్నారు. కూటమి ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రజాపాలన జరుగుతోందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అన్ని శాఖల్లో అవినీతి చేశారు కాబట్టే.. వివిధ శాఖల్లో ఫైళ్లను తగులబెడుతున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా నియామకాలు, కాంట్రాక్టర్లు కట్ట పెట్ట వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పారు. వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు కుమ్మక్కై ఉమ్మడిగా దోపిడీకి తెర లేపారన్నారు. దమ్ముంటే పట్టుకోండి అని ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాని, జగన్ ను చూసి భయపడి.. ఒక్కరూ కూడా ఏపీకి రాలేదన్నారు.

ఇప్పుడు చంద్రబాబును చూసి పెట్టుబడిదారులు మళ్లీ ఏపీకి వస్తున్నారన్నారు. తాము చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్న ఆయన జోగి రమేష్ భూబాగోతం చూశామని, అటాచ్ ఆస్తులను కూడా స్వాహా చేశారన్నారు. వైసీపీ పాలనలో అన్నీ అక్రమాలు, అరాచకాలే జరిగాయన్నారు. జగన్ పెద్ద పెద్ద దోపిడీలు చేశారని, ఆయన అడుగు జాడల్లో ఆపార్టీ నేతలు అందినకాడికి దోచుకున్నారన్నారు. పలానా శాఖలో తాము దోచుకోలేదని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించిన ఆయన, ఏ శాఖ పేరు చెప్పినా.. తాను చర్చకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. అసలు ప్రభుత్వ శాఖల్లో కీలక ఫైళ్లు దగ్దం ఏమిటో వింతగా ఉందన్నారు.

- Advertisement -

ఎవరికీ అర్థం కాని జగన్ ఆర్ట్ ఇది.. దొరక్కుండా తగులబెడుతున్నారన్నారు. చేసిన అవినీతి బయట పడకుండా ఉండాలని ఈ ఫైళ్లు దగ్దం చేస్తున్నారని, గతంలో వైయస్ హయాంలో అనేక మంది అధికారులు జైలుకు వెళ్లారని, ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లడానికి అధికారులు క్యూలు కట్టబోతున్నారన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వైసీపీ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులకు శిక్ష తప్పదన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందన్న ఆయన ఆ విషయం ప్రజలకు అర్థమైందని… వైసీపీ మూర్ఖులకే అర్థం కావడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement