Sunday, November 24, 2024

ఉత్తర్వులు రాకుండానే…… ఉద్యమాలా.?

ముత్తుకూరు, (ప్రభ న్యూస్‌) : ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి క్యాబినెట్‌ సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో అనేక తీర్మానాలు చేసింది. ఈ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రంగ విద్యుత్‌ సంస్థ దామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఇరవై ఐదు సంవత్సరాల పాటు- లీజుకు ప్రైవేటుపరం చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి మండలి క్యాబినెట్‌ తీర్మానం చేసింది. దీనికి సంబంధించి ఈ విషయాలు పత్రికా ముఖంగా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేలటూరు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి సంబంధించి ఇంజనీర్లు, నిర్వాసితులు, మరికొంతమంది కాంట్రాక్టర్లు ఈ అంశాన్ని నెమరు వేసుకుంటూ ఉద్యమ బాట పట్టారు. అసలు ప్రైవేటీకరణ ఉత్తర్వులు రాకుండానే ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. గత వారం రోజుల నుంచి ఏపీ జెన్‌కో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అంటూ ఏపీ జెన్‌కో మెయిన్‌ గేట్‌ వద్ద ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. థర్మల్‌ కేంద్రంలోని కొన్ని విభాగాల ఇంజనీర్లు నిర్వాసిత కార్మికులతో కలిసి ప్రైవేటీ-కరణ విషయంపై ఆందోళన చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఎవరికిస్తుందో అసలు విషయం బయటకు రాకముందే పెద్ద ఎత్తున నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నాయకులను ఏపీ జెన్‌కో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కలిసి తమ ఆందోళనకు మద్దతు తెలపాలని వినతి పత్రాలు సమర్పించి ఉన్నాయి. ప్రధానంగా ఈ ఉద్యమం వెనుక ఏపీ ఇంజనీర్లు కొంతమంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారని స్పష్టంగా ప్రజల్లో కనబడుతుంది. ఇప్పటికీ సీపీఎం, జనసేన పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. అసలు ప్రైవేటీ-కరణ విషయంలో సమగ్రమైన మార్గదర్శకాలు విధివిధానాలు బయటకు రాకముందే ఏపీజెన్‌కో థర్మల్‌ కేంద్రంపై దండయాత్ర మాదిరి ఉద్యమాలు చేయడం ఎంతవరకు సమంజస మో అర్ధం కాకుండా ఉంది.

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ భద్రతా దళాలు వైఫల్యం..

ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రధాన మెయిన్‌ గేట్‌ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ- ఆందోళన చేస్తుంటే ప్రాజెక్టుకు సంబంధించిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ భద్రతాదళాలు పూర్తిస్థాయిలో వైఫల్యం చెందాయి. సహజంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేయాలంటే సంబంధిత శాఖలు అనుమతులు తీసుకోవాలి. జాయింట్‌ యాక్షన్‌ కమిటీ విధులకు హాజరవుతూనే మరోవైపు ఉదయం వేళలో ఉద్యమాలు చేయడం ఎలా ఉన్నా జెన్‌కో పోలీసు యంత్రాంగం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి అనుమతులు లేవని ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. సమగ్రమైన ప్రణాళిక లేకుండా చేస్తున్న ఉద్యమం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఈనెల 29వ తేదీన మెయిన్‌ గేట్‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ- నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు అనుమతుల కోసం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ దరఖాస్తులు పెట్టింది. ఆయా శాఖల అధికారులను కలిసి అనుమతులు కోరినప్పటికీ మండల స్థాయిలో అనుకూలంగా సమాధానం రాలేదు. ఉన్నత స్థాయిలో అనుమతి తీసుకోవాలని స్థానిక అధికారులు సమాధానం చెప్పారు. అసలు ప్రైవేటీకరణ ఉత్తర్వులు విడుదల కాకముందే ఈ గందరగోళం ఉద్యమం ప్రభుత్వ అధికారులకు తలనొప్పిగా మారింది.

భవిష్యత్తులో కేంద్రం చేతుల్లోకి విద్యుత్‌ శాఖ..

కాగా , దేశ వ్యాప్తంగా విద్యుత్‌ శాఖను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా పలు నిర్ణయాలు తీసుకుం టూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తోంది. కేంద్రం బడా ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేయాలని భావిస్తోందని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ .. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. మరోవైపు రాష్ట్రాలకు అభివృద్ధి విషయంలో , నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం కీలకం కావడంతో.. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలకు తలెత్తుతోంది.

- Advertisement -

థర్మల్‌ కేంద్రం ప్రైవేటీకరణ ఉత్తర్వులు ఇంకా రాలేదు : ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ నాగరాజు..

ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు తమకు అందలేదని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ టి. నాగరాజు సమాధానమిచ్చారు. ఈ విషయంపై ఆయన గురువారం సాయంత్రం ఏపీ జెన్‌కో పరిపాలనా భవనం నందు విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటీ-కరణ విషయంలో మార్గదర్శకాలు, విధి విధానాలు పై స్థాయి అధికా రులు చెప్పాల్సి ఉందన్నారు. జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చేస్తున్న ఈ కార్యక్రమా నికి ఏపీ జెన్‌కో స్పెషల్‌ ప్రొ-టె-క్షన్‌ ఫోర్స్‌ భద్రతా దళాల అనుమతి ఉందా అని మీడి యా ప్రశ్నించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ- విధులకు హాజరు అవుతుందని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement