ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఓ దళిత బాలికపై కామాందులు అత్యాచారానికి పాల్పడ్డారు. వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మొత్తం 10 మంది అఘాయిత్యానికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. అయితే, ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు నమోదు చేయకపోవడంపై గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం వీధిలో తండ్రి, కుమార్తె ఉంటున్నారు. ఆమె తల్లి చాలా ఏళ్ల కిందట చనిపోయింది. మసీదు వద్ద ఆ మైనర్ బాలిక భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తుంటాడు. అయితే ఆ బాలికపై అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ డెకరేషన్ దుకాణంలో పని చేస్తున్న యువకుడు చెంబు కన్నుపడింది. చెంబు, అతడి స్నేహితులు కలిసి బాలికపై కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయట పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మే 4 న మల్లీశ్వరి అనే మహిళా కానిస్టేబుల్ బాధితురాలితో మాట్లాడి వివరాలను సేకరించారు.
తనపై చెంబు, అతని స్నేహితులు పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది. తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారని పేర్కొంది. ఈ సమాచారం మొత్తాన్ని వీడియో తీసిన కానిస్టేబుల్ మల్లీశ్వరి.. పట్టణంలోని ఓ సీఐ దృష్టికి దీనిని తీసుకెళ్లారు. అయితే, ఆ సీఐ విషయం బయటకు తెలియనీయకుండా జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది. బాధితురాలిని రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోకి వచ్చే అమృతనగర్లోని ఓ ఆశ్రమానికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. కేసు నమోదు చేయకుండా.. ఆ బాలికను ఈ నెల 8న మైలవరంలోని ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమానికి తరలించారు. కాగా, ఈ సమాచారం తెలిసినా రూరల్ పోలీసులూ కేసు నమోదు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.