Tuesday, November 19, 2024

ఆక్వా ధరలపై ప్రతిరోజూ పర్యవేక్షణ.. పదిరోజులకు ఒకసారి ధరల నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ: ఆక్వా ఉత్పత్తుల్లో ప్రత్యేకించి రొయ్యల ధరలు తగ్గిపోతున్న నేపథ్యంలో రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. ప్రతిరోజూ రొయ్యల మార్కెట్‌ను సమీక్షించటంతో పాటు ప్రతి పది రోజులకు ఒకసారి మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ధరలు ప్రకటించాలని ఆక్వా సాధికార కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌ మెంట్‌ అధారిటీ (అప్సడా) చట్ట నిబంధనలకు అనుగుణంగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌ వోసీ) రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధికార కమిటీ ధరలు నిర్ణయించినా క్షేత్రస్థాయిలో ఆక్వా కంపెనీలు అమలు చేయటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎస్‌ వోసీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఈ మేరకు అతి త్వరలోనే రొయ్యల రైతుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేయనున్నారు. సాధికార కమిటీ నిర్ణయించిన ధరల కన్నా మార్కెట్‌ లో తక్కువ చెల్లిస్తున్నా..క్రయ విక్రయాల్లో మరే ఇతర సమస్యలు ఎదురైనా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి, ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. రొయ్యల ధరల పతనానికి ప్రధాన కారణంగా చూపుతున్న ఎగుమతులపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రంతో చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాధికార కమిటీ బృందం త్వరలోనే ఢిల్లీ వెళ్ళి కేంద్రంతో సంప్రదింపులు చేయనుంది.

- Advertisement -

అమెరికాకు ఈక్వాడార్‌ నుంచి రొయ్యల ఎగుమతులు భారీగా పెరగటం వల్ల మార్కెట్‌ లో ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయనీ, రొయ్యల ధరల పతనానికి అదే ప్రధాన కారణమని ట్రేడర్లు చెబుతున్నారు. ప్రతి ఏటా ఈ సీజన్‌ లో అమెరికాకు ఈక్వాడార్‌ నుంచి రొయ్యల ఎగుమతులు 4 లక్షల టన్నులు ఉండేవనీ, ఇపుడు ఏకంగా మూడు రెట్లు పెరిగి 12 లక్షల టన్నులకు పెరిగాయి… 80 నుంచి 100 కౌంట్‌ చిన్న రొయ్యలను ఎక్కువగా దిగుమతి చేసుకునే చైనా నుంచి కూడా ఆర్డర్లు లేకపోవటంతో మనదేశం నుంచి ఎగుమతులు తగ్గాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎగుమతులపై ప్రభావం పడకుండా ప్రోత్సాహకాలు పెంచటం, ఫీడ్‌, సీడ్‌ తదితర ముడి సరుకులపై దిగుమతి సుంకాల తగ్గింపుపై చర్చించేందుకు ఏపీ ఆక్వా సాధికార కమిటీ బృందాన్ని ఢిల్లీ పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ వెళ్ళే బృందంలో ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులతో పాటు ఫీడ్‌, సీడ్‌, ప్రాసెసింగ్‌ సెంటర్లు, ఎక్స్‌ పోర్ట్‌ కంపెనీల ప్రతినిధులు కూడా ఉండనున్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలు
కిలో కౌంట్‌ – ధర
100 – 210
90 – 220
80 – 240
70 – 250
60 – 270
50 – 290
40 – 340
30 – 380

Advertisement

తాజా వార్తలు

Advertisement